ప్రతిభను ఆచరణలో పెట్టింది

talent Put into practiceచిన్నప్పటి నుండి పరిశోధన పట్ల మక్కువ ఎక్కువ. దానికి తోడు తండ్రి ప్రోత్సాహం. పెండ్లి తర్వాత భర్త వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఓ మహిళ తనలోని ప్రతిభను ఆచరణలో పెట్టేందుకు ఇంకేం కావాలి. ఆ పట్టుదలతోనే సహర్ష్‌ ఫార్మా. సంస్థను స్థాపించారు. చిన్నారుల కోసం సబ్బులు, బేబీ వైప్స్‌, డైపర్స్‌ మొదలైనవి తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రెయిన్‌బో హాస్పిటల్స్‌తో టై-అప్‌ అయ్యి తన ఫార్మా సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమే డా.సుమలత. అంచలంచలుగా ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త జీవిత విశేషాలు మానవి పాఠకుల కోసం…
డాక్టర్‌ గుంటుపల్లి సుమలత తల్లిదండ్రులు చిన్నారావు, మల్లీశ్వరి. వారి స్వగ్రామం గుంటూరు. తండ్రి ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల సుమలత చదువు గుంటూరు, బాపట్లతో పాటు కొంతకాలం హైదరాబాద్‌లో సాగింది. 2001 నుండి 2005 వరకు ఆమె విశ్వభారతి ఇన్‌స్టిట్యూట్‌ గుంటూరు నుండి బి.ఫార్మసీ, 2005 నుంచి 2007 వరకు భారతి ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇబ్రహీంపట్నంలో (జేఎన్‌టీయూ,హైదరాబాద్‌) ఎం. ఫార్మసీ చేశారు. ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్న క్రమంలో పరిశోధనపై ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ తన పనిని మెచ్చుకుని పి.హెచ్‌.డి చేయమంటూ ప్రోత్సహించారు.
రెండో బాబు పుట్టినపుడు
ఆంధ్ర యూనివర్సిటీలో 2008లో పి.హెచ్‌డిలో సీటు వచ్చింది. 2010లో పి.హెచ్‌డి పట్టా అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత సుమలత తండ్రి ప్రోత్సాహంతో ఫార్మసీ రంగంలో అడుగు పెట్టారు. తండ్రి స్థాపించిన సుప్రాసిన్‌ అనే ఒక ఫార్మా మార్కెటింగ్‌ కంపెనీ బాధ్యతలు చూసేవారు. శైలేష్‌తో 2010లో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో బాబును పెంచే క్రమంలో ఆమెకు కొన్ని సమస్యలు వచ్చాయి. అంటే సబ్బులు, డైపర్స్‌ పడక బాబు వంటి మీద రాషెస్‌ వచ్చేవి. ఎందుకిలా జరిగింది? లోపం ఎక్కడుంది? అని తనని తాను ప్రశ్నించుకుని పరిశోధన మొదలు పెట్టారు. తండ్రి నడుపుతున్న ఫార్మా కంపెనీ చూస్తున్న అనుభవంతో తానే స్వయంగా తన సమస్యను పరిష్కరించాలని సుమలత నిశ్చయించుకున్నారు. ఫార్మసీ =డణలో తీవ్ర పరిశోధన మొదలుపెట్టారు.
ఓ బ్రాండ్‌ సృష్టించారు
అత్తగారింటిలో కూడా సుమలతకు మంచి ప్రోత్సాహమే లభించింది. పరిశోధనపై ఉన్న మక్కువ, ఉత్సాహం, శ్రద్ధ వల్ల కొడుకు పేరు మీద 2021లో ‘సహర్ష్‌ ఫార్మా’ అనే సంస్థను స్థాపించి ‘మీచు’ అనే బ్రాండ్‌ సృష్టించారు. అప్పుడే పుట్టిన పిల్లల (నియో నాటల్‌) నుండి మూడేండ్ల పిల్లలకు అవసరమయే వైప్స్‌, డైపర్స్‌, సబ్బులు మొదలగు ఉత్పత్తులను లాంచ్‌ చేశారు. బేబీ వైప్స్‌, బేబీ లోషన్‌, బేబీ సోప్‌, బేబీ డైపర్స్‌, అబ్సార్‌బెంట్‌ వెట్‌ షీట్స్‌ కొన్ని వీరి ఉత్పత్తుల్లో ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులన్నీ ఢిల్లీలో తయారవుతాయి. మధ్య మధ్యలో తానే స్వయంగా అక్కడికి వెళ్ళి తయారయ్యే ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంటారు. ఫైనల్‌ ప్రొడక్ట్స్‌ వచ్చేంత వరకు దగ్గరుండి చూసుకుంటారు.
అంతకు ముందు ఎన్ని ఉన్నా…
అంతకు ముందే పెద్ద పెద్ద సంస్థలు చేసిన ఉత్పత్తులు ఉన్నవి కదా, నీవు చేసినవి ఏం నడుస్తాయన్న వాళ్లకు సమాధానంగా ఎదిగి ఉన్నత స్థాయిలో మంచి డిమాండ్‌తో తన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నారు సుమలత. ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, మీషో, జియో మార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌, టాటా ఐఎన్‌జి ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. అలాగే రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌తో కూడా టై-అప్‌ చేసుకున్నారు. తన తెలివితో ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఉపయోగించి పిల్లలకు ఎటువంటి రాషెస్‌ రాని ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంతే కాదు తన సంస్థలో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
నమ్మకమే కారణం
మార్కెట్‌లోకి వచ్చిన వారంలోపే అన్ని ఉత్పత్తులు అమ్ముడు పోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు డా. సుమలత. తాము ఉత్పత్తి చేసిన వస్తువుల మీద వినియోగదారులకు ఉండే నమ్మకమే దీనికి కారణమంటూ ఆనందంగా చెబుతున్నారు. 2021 అక్టోబర్‌లో ఆమె తన ఉత్పత్తులను మొదలు పెట్టారు. అనతి కాలంలోనే రూ.70 లక్షల రూపాయల టర్నోవర్‌తో మీచు ప్రొడక్ట్స్‌ ముందుకు దూసుకుపోతున్నది. రాబోయే కాలంలో బేబీ టూత్‌ పేస్ట్‌, బేబీ షాంపూ, మసాజ్‌ ఆయిల్‌, బేబీ వెట్‌ వైప్స్‌ కూడా వీరి సంస్థ నుండి వస్తాయంటున్నారు. 6 నుండి 17 ఏండ్ల పిల్లలకు కూడా పనికివచ్చే విధంగా ఉత్పత్తులు చేస్తామన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
– డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, హైదరాబాద్‌