కొచ్చిన్‌లో ‘పిట్టల’ పర్యటన

– కేరళ మత్స్య పరిశ్రమపై అధ్యయనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్‌లో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఆయన కేరళ మత్స్య పరిశ్ర మపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా 11 సంస్థలను ఆయన పరిశీలిస్తారని బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో మత్స్య కారులు వినియోగిస్తున్న సాంప్రదాయ తెప్పలు, పుట్టీలకు బదులు సౌరశక్తి, జలశక్తి సంయుక్త వినియోగంతో నడిచే తేలికపాటి మర పడవలను ప్రవేశపెట్టేందుకు వీలున్న అవకాశాలను ఈ పర్యటనలో ప్రధానంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మత్స్య కారులకు శిక్షణ, చేపల వేటలో అనుసరించాల్సిన సురక్షిత విధానాలు, ప్రాసెసింగ్‌, చేపల ఆహార తయారీలో వస్తున్న మార్పులు, ఎగుమతులు, అదనపు ఆదాయ మార్గాలు తదితర అంశాలను అధ్యయనం చేస్తారని వివరించారు.