సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య

– షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
– కొత్తూరులో ఘనంగా విద్యా దినోత్సవం
– నవతెలంగాణ-కొత్తూరు
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలలో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం కింద సర్కారు పాఠశాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. పాఠశాలలో నాణ్యమైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా ఫలితాలను సాధిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు వారంలో మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు కోడిగుడ్డును ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్య దేవేందర్‌ యాదవ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, ఇన్‌చార్జి ఎంపీపీ శోభా లింగం నాయక్‌, జిల్లా వైద్య విద్య స్టాండింగ్‌ కమిటీ మెంబర్‌ జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డోలి రవీందర్‌, కౌన్సిలర్స్‌ చింతకింది చంద్రకళ రాజేందర్‌ గౌడ్‌, కోస్గి శ్రీనివాస్‌, మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, నాయకులు ఏనుగు జనార్దన్‌ రెడ్డి, కమ్మరి జనార్ధన్‌ చారి, బ్యాగరీ యాదయ్య, రవి నాయక్‌, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.