ప్రధాని వ్యాఖ్యలపై రాజస్థాన్‌ సీఎం గరంగరం

జైపూర్‌ : మణిపూర్‌లో మాత్రమే కాదు.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతింటున్నాయని గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం జైపూర్‌లో అశోక్‌గెహ్లాట్‌ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మొట్టమొదటిసారిగా నేను చెప్పదలచుకున్నది.. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటించడం చూశాను. కానీ మణిపూర్‌లో పర్యటించడం చూడలేదు. మణిపూర్‌లో ఉన్నది ఆయన ప్రభుత్వమే. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లయితే ఆయన ఏం మాట్లాడతారో ఒక్కసారి ఊహించుకోండి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల సీఎంలు తమ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి చూసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ గురువారం చెప్పిన తీరు రాజస్థాన్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది.’ అని ఆయన అన్నారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటించలేకపోతే ఆ రాష్ట్ర పరిస్థితిని సమీక్షించి సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సిందని గెహ్లాట్‌ సూచించారు.
ప్రభుత్వంపై విమర్శలు.. రాజస్థాన్‌లో మంత్రిపై వేటు
సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన మంత్రికి రాజస్థాన్‌ సర్కారు షాక్‌ ఇచ్చింది. పదవి నుంచి తప్పిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంత్రిగా పలు శాఖల బాధ్యతలు చూస్తున్న రాజేంద్ర గుధా తన పదవిని కోల్పోయారు.