భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం : రజత్‌కుమార్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ అప్రమత్తంగా ఉందని ఆ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయనీ, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్ట్ల చెప్పారు. డ్యామ్‌ ఎత్తు 700 అడుగులు కాగా, 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని అన్నారు. గతేడాది 706 అడుగుల మేర నీరు ప్రవహించిందనీ, ఎలాంటి ఇబ్బంది జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.
మిషన్‌ కాకతీయ ఫలితాలు కనిపిస్తున్నరు..
బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు ములుగులో అత్యధికంగా 650 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత పెద్ద మొత్తంలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని రజత్‌కుమార్‌ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైందనీ, నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నదని గుర్తు చేశారు. మిషన్‌ కాకతీయ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయనీ, మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పూడికతీతతో ఇంత భారీ వర్షాలు, వరదలతో పెద్దగా గండ్లు పడడం లేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన కేవలం 100లోపు చెరువులు మాత్రమే గండ్లు పడ్డాయని తెలిపారు. గోదావరి నదిలో వరద ఎక్కువగా ఉందనీ, జిల్లా కేంద్రాల్లో నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా ఇంజినీర్లను నియమించినట్టు వివరించారు. కడెంలో వరద ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఇన్‌ఫ్లో తగ్గిందన్నారు. రాబోయే కొద్దిగంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్యామ్‌లపైకి వెళ్లి సెల్ఫీ తీసుకోవద్దని సూచించారు.
భద్రాచలం వద్ద ఉధతంగా గోదావరి
భద్రాచలం దగ్గర గోదావరి నది ఉధ్రృతంగా ప్రవహిస్తున్నదని రజత్‌కుమార్‌ తెలిపారు. అక్కడ సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.లోతట్టు
ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచామన్నారు. సైనికులను అక్కడ అందుబాటులో ఉంచుతామనీ, సాయంత్రం భద్రాచలానికి రెండు హెలికాప్టర్లు పంపున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తి ఉంచాలని చెప్పామనీ, గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయని వివరించారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.