నిరుద్యోగుల గోసపై ర్యాలీ

నవతెలంగాణ- రామారెడ్డి: నిరుద్యోగుల గోసపై మండలంలోని మద్దికుంట తో పాటు వివిధ గ్రామాల్లో నిరుద్యోగులు మంగళవారం ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్నికల్లో విద్యార్థుల కోసం ఎన్నో వాగ్దానాలు చేసి, మోసం చేసిన కేసీఆర్ కి మళ్ళీ ఓటేద్దామా? ఆలోచించి ఓటు వేసి నిరుద్యోగులను కాపాడండి అంటూ ఓటర్లను వేడుకున్నారు. కేజీ టు పీజీ అని చెప్పి బడులను మూసేసిన  మహా మేధావి అని, గత పది సంవత్సరాల నుండి జాబ్ కాలండర్ను విడుదల చేయలేదని, ఇంటర్ ఫలితాల్లో వైఫల్యం, విద్యార్థుల ఆత్మహత్యలు, బంగారు తెలంగాణ అని చెప్పి, విద్యార్థులను బిచ్చం ఎత్తుకునేలా తీసుకొచ్చిన అపార చాణిక్యుడని, గ్రూప్ వన్, టు రద్దుకు గురై, గిన్నిస్  రికార్డ్ కోసం బయలుదేరిన ఉత్తమ పోటీదారుడు అని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, డీఎస్సీ పోస్టులు భర్తీ చేయకపోవడం, పరీక్ష ఫీజు పెంచడం విద్యార్థులకు చేసిన మోసమేనని, ఓటర్లారా గమనించి నిరుద్యోగుల పట్ల ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.