తెలుగు భాషా సాహిత్యాభివృద్ధిలో రామానుజరావు కృషి

– జయంతి సభలో వక్తలు
– రచయిత దిలీప్‌రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం ప్రదానం
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
కవిగా, విమర్శకుడిగా, విద్యావేత్తగా, సారస్వత పరిషత్తు, సాహిత్య అకాడమీల సారథిగా తెలుగు భాషా సాహిత్యాలకు అనితర సాధ్యమైన సేవలం దించిన దేవులపల్లి రామానుజరావు కారణజన్ములని వక్తలు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లో శుక్రవారం డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు 106వ జయంతి కార్యక్రమం, ప్రముఖ పత్రికా రచయిత ఆర్‌.దిలీప్‌ రెడ్డికి రామానుజరావు పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. దిలీప్‌రెడ్డిని రూ.25 వేలు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కెవి.రమణాచారి ప్రసంగిస్తూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హిందీ విశ్వవిద్యాలయంగా చేయాలనుకున్నప్పుడు దేవులపల్లి రామానుజరావు అప్పటి కేంద్ర విద్యామంత్రి అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, ప్రధానమంత్రి నెహ్రూను కలిసి ఎంతో కృషి చేసి మనకు విశ్వవిద్యాలయం దక్కేలా చేశారని చెప్పారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి వంటి పెద్దల కృషి వల్ల ఆధునిక తెలంగాణ రూపుదిద్దుకుందని చెప్పారు. పాత్రికేయు నిగా సమాచార హక్కు చట్టం తొలి కమిషనర్‌గా వినయ సంపన్నుడిగా పేరుపొందిన దిలీప్‌రెడ్డికి రామానుజరావు పురస్కారం అందజే యడం సముచి తమన్నారు. పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. రామానుజ రావు లేనిదే పరిషత్‌ లేదని, అంతగా పరిషత్‌తో మమేకమై జీవనం సాగించారని తెలిపారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె చెన్నయ్య మాట్లాడుతూ.. రామానుజరావు సారస్వత పరిషత్తు వేదికగా తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కేంద్ర బిందువై నిలిచారని కొనియాడారు. పరిషత్‌ కోశాధికారి మంత్రి రామారావు మాట్లాడుతూ.. రామానుజరావ్‌ స్వార్థమెరుగని సారస్వత కృషీవలుడు అన్నారు. సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ ముదిగంటి సుజాతా రెడ్డి, తెలుగు జానపద సాహిత్య పరిషత్తు అధ్యక్షులు డాక్టర్‌ సి.వసుంధరరెడ్డి మాట్లాడారు. పురస్కార గ్రహీత దిలీప్‌ రెడ్డి స్పందన ప్రసంగం చేశారు.