అంతర్జాతీయ న్యాయ మహాసభకు రమేష్‌ కుమార్‌ మక్కడ్‌

నవతలంగాణ-కొత్తగూడెం
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ బార్‌ కౌన్సిల్‌, ది లా సొసైటీ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌, కామన్వెల్త్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ల సహకారంతో న్యూ ఢిల్లీలోని విగ్యాన్‌ భవన్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న ”ఇంటర్నేషనల్‌ లా కాన్ఫరెన్స్‌”లో పాల్గొనేందుకు ప్రతినిధిగా కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే ఈ మహాసభల్లో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ డి.వై.చంద్రచూడ్‌, ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ కూడా హాజరు కానున్నారు. కేంద్ర హౌమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా వీడ్కోలు సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భుపేందర్‌ యాదవ్‌, యునైటెడ్‌ కింగ్‌డం లార్డ్‌ ఛాన్సలర్స్‌తో పాటు భారతదేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా పాల్గొంటారు. న్యాయ రంగంలో అంతర్జాతీయ సహకారం, న్యాయ నిపుణుల మధ్య అవగాహన, సహకారాన్ని ప్రోత్సహించడం, భౌగోళిక సరిహద్దులు, అధికార వ్యత్యాసాలను అధిగమించడం ఈ సదస్సు నినాదం. జస్టిస్‌ డెలివరీ సిస్టంలో ఎదురవుతున్న సవాళ్లు అనే అంశం నేపథ్యంలో, ప్రపంచ వ్యాపిత వివాదాలపై ప్రపంచ వ్యాపిత చట్టాలు-అంతర్జాతీయ న్యాయ పరిష్కారాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో న్యాయం, న్యాయ సహాయం పొందడం, ”జస్టిస్‌ డెలివరీ సిస్టమ్‌”పై సోషల్‌ మీడియా ప్రభావం, అంతర్జాతీయ లావాదేవీలలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, కృత్రిమ మేధస్సు-న్యాయ వ్యవస్థ, మేధో సంపత్తి హక్కులు, మారుతున్న నేర చట్టాలు, స్థిరమైన న్యాయవాద వృత్తిని నిర్మించడం, న్యాయ నిపుణులు, సంస్థల పాత్రను అభివృద్ధి చేయడం, న్యాయ విద్య భవిష్యత్తు-రాబోయే తరం న్యాయవాదులు, తదితర 10 అంశాలపై ఈ మహాసభ చర్చిస్తుంది.