– సమంత్ గోయెల్ స్థానంలో నియామకం
న్యూఢిల్లీ : విదేశాల్లో భారత్‌కు ముఖ్యమైన గూఢచర్య సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు తదుపరి చీఫ్‌గా రవి సిన్హా నియమితులయ్యారు. ఈయన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత చీఫ్ సమంత్ గోయెల్ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ‘రా’ అధిపతిగా రవి సిన్హా రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈయన నియామకానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో సమంత్ గోయెల్ రెండేండ్ల కాలానికి గానూ ‘రా’ చీఫ్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు రెండు సార్లు ఆయన పదవిని పొడిగించారు. ఈ నెల 30 నాటికి ‘రా’ చీఫ్‌గా సమంత్ గోయెల్ పదవి కాలం ముగుస్తుంది. ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన రవి సిన్హా.. గత ఏండేండ్లుగా ‘రా’ ఆపరేషనల్ విభాగంలో అధిపతిగా సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్, ఈశాన్య భారత్ వంటి విషయాలపై పని చేసిన ఆయనకు పొరుగు దేశాల్లో జరిగే పరిణామాలపై మంచి పట్టు ఉన్నది. భారత ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రతిభావంతుడిగా ఆయనకు పేరున్నది. విదేశాల్లో ఖలిస్థాన్ అనుకూల చర్యలు పెరగటం, ఉగ్రవాద గ్రూపుల భారత వ్యతిరేక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల రవాణ కోసం సముద్ర మార్గాలను ఉపయోగించటం, హ్యాకర్ల చేతిలో భారతీయులు మోసపోవటం, ఫిన్‌టెక్ నెట్‌వర్క్‌లు వంటి బెదిరింపులపై గత నాలుగేండ్లుగా రా విస్తృతంగా పని చేసింది. ఈ నేపథ్యంలో రవి సిన్హా నియామకం ప్రాధాన్యతను సంతరించుకున్నది.