ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్డీవోలను నియమించే

– ఆలోచనను విరమించుకోవాలి
– టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్డీవోలను నియమించే ఆలోచననురాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండి. ఫసియోద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు, ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్డీవోలను నియమిస్తామని చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగం అనేది సేవా రంగమనీ, దీన్ని ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా చూడకూడదని సూచించారు. ఇందులో అనేక సాధక బాధకాలు ఉంటాయనీ, అందుకోసం ఈ రంగంలోఉద్యోగంలో చేరిన వారికి అపార అనుభవం ఉంటాయనీ, వారే రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించగలుగుతారని తెలిపారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోకపోతే వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని డాక్టర్ల సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లను, పారామెడికల్‌ సంఘాలను, వివిధ ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.