సైన్స్‌ ఫలాలు సామాన్యులకు అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం

– జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
సైన్సు ఫలాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోయ వెంకటేశ్వరరావు మాట్లాడు తూ.. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో సైన్సు ఫలాలు కిందిస్థాయి ప్రజలకు చేరువకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థల ఆధీనంలో సైన్స్‌ ఫలాలు కేంద్రీకృతమై ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు సైతం బడా సంస్థలకు వత్తాసు పలుకుతూ సైన్స్‌ ఫలాలను విస్తరించడం లేదన్నారు. సైన్సు ఫలాల వికేంద్రీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర రావు, లింగస్వామి, రవీందర్‌, భీమేశ్వర్‌, ఆల్తాఫ్‌, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.