నిజమైన తెలంగాణ నిర్మాణమే కాంగ్రెస్‌ లక్ష్యం

– అనైక్యత వల్లే రెండుసార్లు ఓడిపోయాం…
– ఈసారి విజయం మాదే…
– బీజేపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా
– బీఆర్‌ఎస్‌, బీజేపీకి లోపాయికారి ఒప్పందం
– రెండు నెలల ముందే 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తాం
– కుటుంబానికి ఒక్కటే టికెట్‌
– మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయమేరకే సీఎం అభ్యర్థి ఎంపిక
– వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేస్తా
– నవతెలంగాణ ఇంటర్వ్యూలో మహేష్‌కుమార్‌ గౌడ్‌
నిజమైన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకుపోతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. మాలో ఉన్న అనైక్యత వల్లే రెండుసార్లు కాంగ్రెస్‌ ఓడిపోయిందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. బీజేపీ పది, పదిహేను సీట్లకు మించి గెలవదన్నారు. బీజేపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. ఆపార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని తెలిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ నిబంధనావళి ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కటే టికెటు ఇస్తామని వెల్లడించారు. మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయంమేరకే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. సీఎం అయ్యే శక్తి సామర్థ్యాలు చాలా మందికి ఉన్నాయని తెలిపారు. పార్టీ కార్యకర్తగా తాను పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నవతెలంగాణకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన ఎలా ఉంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిందా?
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ…ఆనాడు కేసీఆర్‌ చేసిన అబద్దపు ప్రచారాలు, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు. కాంగ్రెస్‌లో ఉన్న అనైక్యత వల్ల 2014,2018 ఎన్నికల్లో ఓడిపోయాం. తొమ్మిదేండ్ల తర్వాత ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు.ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకను గుణంగా బీఆర్‌ఎస్‌ పాలన జరగలేదు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం…దాదాపు 15వేల కోట్లకు పైగా మిగులు ఉన్నది. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతో అప్పుల రాష్ట్రంగా అవతరించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఆచరణ సాధ్యం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమీషన్లు దండుకున్నారు.ఆ ప్రాజెక్టు పేరిట లక్షల కోట్లు గోదావరి నదిలో పోసింది. అధికారులు, తాబేదార్లుగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు, ధనికులయ్యారు. ధనిక రాష్ట్రం ఇవాళ బీద రాష్ట్రమైంది. ప్రత్యేకంగా ధరణి పోర్టల్‌ లోసుగులు ఉపయోగించుకుని ధనికులు మరింత ధనికులవుతున్నారు. బీదవారిని ధనికులను చేయడం లేదు. పేదలకు వైద్యం అందడం లేదు. దేశంలోనే బీద రాష్ట్రంగా దిగజారిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వెనక్కు నెట్టివేయబడ్డారు. గొర్లు, బర్లు ఇచ్చిన సంతృప్తి పరిచారు. ఇవన్నీ చూసిన ప్రజలు ఇక చాలు దొర అంటున్నారు. కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్‌ మాటిస్తే నిలబడుతుంది. నిజమైన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తుంది.
కాంగ్రెస్‌లో అంతర్గత కొట్లాటలే తప్ప పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపన లేదన్న భావన క్యాడర్‌లో ఉన్నది? మీ అభిప్రాయం?
అంతర్గత విభేదాలు ప్రతీ పార్టీలోనూ ఉంటాయి. బీజేపీలో లేవా? బీజేపీ అధ్యక్షుడిని తొలగించి కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ప్రయత్నాలున్నాయి. కాంగ్రెస్‌లో ముఠాలు ఉంటాయనేది నానుడి. పార్టీలో పరిపూర్ణమైన స్వేచ్చ ఉంటుంది. బాహాటంగా విమర్శించుకుంటారు. బాహాటంగా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఉన్నది. సమయం వచ్చినప్పుడు ఏకమవుతారు. కర్నాటకలో చూశాం. రెండు పెద్ద పవర్‌ సెంటర్లు ఉన్నప్పటికీ ఎన్నికలొచ్చినప్పుడు సిద్ధరామయ్య, డికే శివకుమార్‌ కలిసి పని చేశారో, ఇక్కడ కూడా ఎంత పెద్ద నాయకులు ఉన్నా…అధికారం మా కోసం కాదు…ప్రజల కోసమైన అధికారం రావాలి. తెలంగాణ ప్రజలు దగాపడ్డారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ముందుకు పోతాం.
కాంగ్రెస్‌లో మనస్పర్థలు సమసిపోయినట్టేనా?
ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ అయినప్పుడు మనస్పర్థలుం టాయి. నాయకుల మధ్య విభేదా లుంటాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆధ్వర్యంలో వ్యక్తిగత తగాదాలు సద్దుమణుగుతాయి. వ్యక్తిగత, ప్రజాస్వామిక స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉన్నట్టు ఏ పార్టీలో ఉండదు. ఏ ఇతర పార్టీల్లో ఉండదు.
బీజేపీకి బీఆర్‌స్సే ప్రత్యామ్నాయమనేది బాగా వినిపిస్తుంది? కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటి?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని పార్టీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు చెప్పకనే చెప్పారు. అభ్యర్థులు కూడా లేరని కూడా చెప్పారు. బీజేపీకి 10 నుంచి 15 సీట్లు మినహా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ గెలిస్తే మేము రాజకీయాలను వదిలేస్తాం. మతాల మధ్య విచ్ఛిన్న సంస్కతి ఉన్న నియోజకవర్గాలు తప్ప ఆపార్టీ గెలిచే అవకాశం లేదు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు అసలే లేరు. కాంగ్రెస్‌ పార్టీని గెలువనీయంటున్నారు. దీని అర్థమేంటి? వారిద్దరికి లోపాయికారి ఒప్పందం ఉంది. కేసీఆర్‌కు స్పష్టమైన ఒప్పందం ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను ఎన్నుకునే ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. దక్షిణాదిలో బీజేపీకి అవకాశం లేదు. కర్నాటకలోనూ అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న కుల, మత సమీకరణ వల్ల బీజేపీకి చాన్స్‌ లేదు. గెలిస్తే పది సీట్లకు మించి గెలువదు.
బీఆర్‌ఎస్‌ బీజేపీపై దాడి చేస్తుంది? కేసీఆర్‌ను తప్ప బీజేపిపై విమర్శలు చేయరు కదా?
రెండు పార్టీలకు సమాన దూరంగా ఉన్నాం. బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు. ఆ విషయాన్ని రాహుల్‌గాంధీ చెప్పారు. బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు లోపాయికారి ఒప్పందం ఉన్నది. బీజేపీ ఇక్కడ ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబటి బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేసుకున్నాం. అంత మాత్రానా బీజేపీని వదిలే ప్రసక్తే లేదు. ఈ రెండు పార్టీలను వేరుగా చూడటం లేదు. లిక్కర్‌ స్కాంలో కవితను ఏ విధంగా తప్పించారో చూశాం.
కాంగ్రెస్‌ను తట్టుకునేందుకు ఈ రెండు పార్టీలు వేర్వేరు అన్నట్టు డ్రామాలాడుతున్నాయి. కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ అంటూ యూపీఏ భాగస్వామి పార్టీల వద్దకు పోతున్నారు. ఎన్టీఏ భాగస్వామ్య పార్టీల వద్దకు పోలే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ఉండాలనేది కేసీఆర్‌ ప్రయత్నం.
ఎన్నికలకు ఆర్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటూ రేవంత్‌రెడ్డి చెప్పారు? అటువంటి ప్లాన్‌ ఉందా?
గతంలో అనుకున్నాం కానీ సాధ్యం కావట్లేదు. అయితే రెండు నెలల ముందు 50 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తాం. క్లియర్‌గా ఉన్న సీట్లను ముందు ప్రకటిస్తాం. అటువంటి సీట్లు 50 వరకు ఉండొచ్చు. మిగతా 69 సీట్లలో వివాదాలు లేవు కానీ పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీలో పోటీ చేస్తామని అడిగే నాథుడే లేరు. గతంలో చివరి నిమిషంలో ప్రకటించడం ద్వారా పార్టీకి కొంత నష్టం జరిగింది. ఈసారి అలా జరగకూడదని నిర్ణయించాం.
కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతుంది?
ఎన్నికల్లో ప్రజల తీర్పు కీలకమైంది. ప్రజా సొమ్ము దోస్తే ఊరుక్కోబోమంటూ అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇక్కడ కూడా బీఆర్‌ఎస్‌ దోపిడీని వ్యతిరేకిస్తున్నారు. కర్నాటకలో సగభాగం తెలంగాణలో ఉండేది. ప్రజల ఆలోచనల్లో సారూప్యత ఉంది. బీజేపీ ట్రయాంగిల్‌ ఫైట్‌ అయితే బీఆర్‌ఎస్‌ లాభపడుతుంది అని కేసీఆర్‌ ఆలోచన. కానీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్సే మధ్య పోటీ ఉంటుంది. స్ట్రైట్‌ ఫైట్‌లో మేమే గెలుస్తాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు దోచుకున్న డబ్బుఉంది. కర్నాటక ఎన్నికలు చూసిన తర్వాత డబ్బు పని చేయదనేది తేలిపోయింది. దాన్ని అధిగమించి గెలిచి తీరుతాం.
షర్మిల డికె శివకుమార్‌ భేటీ కావడం పట్ల మీ అభిప్రాయం?
బీజేపీ ఎలుబడిలో ఉన్న రాష్ట్రం కర్నాటక. అటువంటి రాష్ట్రంలో ఒక సెక్యూలర్‌ పార్టీ అధికారంలోకి రావడం శుభా పరిణామం. ఈ సందర్భంగా డికేను వైఎస్‌ షర్మిల కలిసి అభినందించడం సహజం. అది ఎవరైనా చేస్తారు. అందులో తప్పేమీ లేదు.
ఈసారి మీరెక్కడ పోటీ చేస్తారు?
నేను ఒక కార్యకర్తగా పోటీ చేయాలని కోరుకోవడం సహజం. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. నేడు పోటీ చేయాలనుకుంటున్నది. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం.