రద్దు సబబే..

The reason for cancellation..– ఆర్టికల్‌ 370పై సుప్రీంకోర్టు తీర్పు
– జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి
– సెప్టెంబర్‌ 30 లోపు ఎన్నికలు జరపండి :కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్ధించింది. ఈ అధికరణ తాత్కాలికమైనదేనని, దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజరు కిషన్‌ కౌల్‌, సంజరు ఖన్నా, బీఆర్‌ గవారు, సూర్యకాంతతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించిన విషయం తెలిసిందే. తీర్పు సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్‌కు అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరని తెలిపింది. భారతదేశంలో విలీనమైన తర్వాత జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని గుర్తు చేసింది. యుద్ధ వాతావరణంలో తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్‌ 370ని తీసుకొచ్చారని వివరించింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులంటూ ఏవీ ఉండవని, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏ హక్కులు ఉంటాయో దీనికీ అంతే ఉంటాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 1, 370 అధికరణల ప్రకారం భారత్‌లో జమ్మూకాశ్మీర్‌ అంతర్భాగమేనని చెప్పింది. రాజ్యాంగ నిబంధనలు జమ్మూకాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయని, ప్రత్యేకతలేవీ ఉండవని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌ నుండి లఢక్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్ధించింది.
రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏదైనా ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమేమీ లేదని వ్యాఖ్యానించింది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌ 30వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్‌ ఐదవ తేదీన పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో 23 పిటిషన్లు దాఖల య్యాయి. వీటిపై ధర్మాసనం ఆగస్ట్‌ 2 నుండి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్‌ ఐదున తీర్పున రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం సోమవారం దానిని వెలువరించింది.
కలవరపరుస్తోంది సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కలవరపరుస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగం ప్రాధమికాంశాల్లో ఒకటైన ఫెడరల్‌ వ్యవస్థకు తీవ్ర పర్యవసానాలు ఏర్పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. భారత యూనియన్‌లోకి విలీనమవుతున్న ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్‌కు ఎలాంటి సార్వభౌమాధికారం వుండబోదని తీర్పు చెబుతోంది. కానీ, ఇప్పుడు రద్దు చేసిన 370వ అధికరణలో వున్నట్టుగా ప్రత్యేక హోదాను కొనసాగించేందుకే షరతులతో కూడిన విలీనంపై సంతకాలు జరిగాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
భారత యూనియన్‌లో ఇతర అన్ని రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రం కూడానని సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది. తద్వారా, 371వ అధికరణలోని వివిధ క్లాజుల కింద ఈశాన్య రాష్ట్రాలకు, మరికొన్ని రాష్ట్రాలకు మంజూరైన ప్రత్యేక హక్కులు కూడా జమ్మూ కాశ్మీర్‌కు లేకుండా పోయాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ తీసుకున్న చర్యకు సంబంధించిన తప్పొప్పులను కూడా ఈ తీర్పు పరిశీలించలేదు. పైగా తిరిగి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామంటూ సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారని పేర్కొంది. అదే సమయంలో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సమర్ధించింది. అంటే పూర్వపు జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని పునరుద్ధరించడమనేది జరగదు, అందులో కొంత భాగానికి మాత్రమే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారు. అది కూడా ఇంకా కాగితాలపై హామీగానే మిగిలివుంది. ఆశ్చర్యకరమైన అంశమేమంటే, 2024 సెప్టెంబరు 30లోగా జమ్మూ కాశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించాలంటూ భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంటే జమ్మూ కాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను ఇంకా కొసాగించడానికి సుదీర్ఘ సమయాన్ని ఇచ్చిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో వున్నపుడు, ఆ రాష్ఠ్ర హోదాను రద్దు చేసినపుడు, ఎన్నికైన శాసనసభ లేని సమయంలో రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌ యొక్క సమ్మతిని ప్రత్యామ్నా యంగా తీసుకోవచ్చా? అని ప్రశ్నించింది. దీనివల్ల, రాష్ట్రపతి పాలన విధించబడినపుడు, దాని సరిహద్దులు మార్చబడినపుడు లేదా రాష్ట్ర హోదాను రద్దు చేసినపుడు ఇతర అన్ని రాష్ట్రాలకూ తీవ్ర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించింది.
ఏ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లునైనా వారి అభిప్రాయం తెలుసుకోవడం కోసం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి నివేదించాల్సి వుంటుందని రాజ్యాంగంలోని 3వ అధికరణ పేర్కొంటోంది. కానీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతాలు, సరిహద్దులు లేదా ప్రస్తుతమున్న రాష్ట్రాల పేర్లు మార్పుకు సంబంధించి కేంద్రప్రభుత్వమే ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి అనుమతించడంతో ఈ తీర్పు అనేక సమస్యలకు దారి తీస్తోంది. సమాఖ్యవాదానికి, ఎన్నికైన రాష్ట్ర అసెంబ్లీల హక్కులకు తీవ్ర విఘాతం కలిగించడానికి కూడా దారి తీస్తుందని విమర్శించింది.
జూప్రధాన తీర్పును, దానితో పాటే ఇచ్చిన మరో రెండు తీర్పులను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే సవివరమైన స్పందన వెలువడుతుందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ఏది ఏమైనా, ఈ తీర్పు వల్ల మన రాజ్యాంగ ఫెడరల్‌ వ్యవస్థకు తీవ్ర పర్యవసానాలు కలిగే అవకాశాలున్నాయని స్పష్టమైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. జాతీయ భద్రతను ప్రస్తావించడం ద్వారా సమగ్రత పేరుతో ఏకపక్ష ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసేలా తీర్పు వుందని వ్యాఖ్యానించింది.