‘డబుల్‌’ ఇండ్ల పేరుతో వసూళ్లు

– అధికారులతో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కార్పొరేటర్‌
నవతెలంగాణ-అంబర్‌ పేట
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇప్పిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సహకారంతో హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ కార్పొరేటర్‌ ఇ.విజరుకుమార్‌ గౌడ్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళ్తే..
ఎల్బీనగర్‌కు చెందిన యేసయ్య అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో శనివారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేర అమాయకుల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ స్థానిక రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సహకారంతో అతన్ని పట్టుకొని అంబర్‌పేట పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు అతన్ని విచారించగా.. మరో ముగ్గురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపారు.