రెగ్యులరైజ్‌ చేయండి

– యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల జేఏసీ విజ్ఞప్తి
– మంత్రులకు వినతి పత్రాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పులఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మానవీయ ముఖ్యమంత్రి అని, ఎంతోమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తమ రెగ్యులరైజేషన్‌ గురించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ పరుశరామ్‌, చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బైరినిరంజన్‌, వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ దత్తహరి, వెంకటేశ్వర్లు, కో-కన్వీనర్స్‌, శివారెడ్డి, డాక్టర్‌ నారాయణ గుప్తా, డాక్టర్‌ కాంతారెడ్డి, శశికాంత్‌, సుధాకర్‌ కో-ఆర్డినేటర్స్‌ డాక్టర్‌ అర్జున్‌, గంగాకిషన్‌, కిరణ్‌ రాథోడ్‌, నాగేశ్వరరావు, తిరుపతి, ఆనంద్‌, పరంధాం తదితరులు ఉన్నారు.