– కుటుంబానికి 50 కేజీల బియ్యం, రూ. 10 వేలు ఆర్థిక సాయమందించాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేయాలనీ, పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించాలనీ, కుటుంబానికి 50కేజీల బియ్యం,రూ.10వేలు ఆర్థిక సాయమందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ గూడేలు, మారుమూల గ్రామాలు, పట్టణాల మధ్య తెగిన రోడ్లు, కరెంట్ సౌకర్యాలను తక్షణం పునురుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వానలకు తడిస,ి కూలి పోయిన ఇండ్ల స్థానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. మొబైల్ వైద్య కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు. ప్రతి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించాలనీ, డ్రైనేజీ కాల్వల పూడిక తీయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామానికి రక్షిత తాగునీటిని అందించాలని కోరారు. వరదల్లో కోట్టుకు పోయి చనిపోయిన వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకోవాలనీ, తల్లి తండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు.