మత సంకుచిత రాజకీయాలు దేశానికి ప్రమాదం

– షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సభలో మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మత, సంకుచిత రాజకీయాలు దేశానికి ప్రమాదంగా మారుతున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే, ఆవాజ్‌ ఆధ్వర్యంలో షోయబుల్లాఖాన్‌ వర్థంతి సభను ఎస్‌ వినరుకుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ మతోన్మాదం దేశమంతటా మరోసారి పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో షోయబ్‌ పోరాటాన్ని, త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం పెరిగిందన్నారు. గద్దర్‌, జహీర్‌అలీఖాన్‌ పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవాలన్నారు. ప్రజలకోసం నిలబడేందుకే షోయబుల్లాఖాన్‌ పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారని గుర్తు చేశారు.నిజాం నియంతృత్వ, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన్ను సొంతం చేసుకునేందుకు మతోన్మాద శక్తులు విఫల ప్రయత్నాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్‌ వినరుకుమార్‌ మాట్లాడుతూ నిజాం ప్రభుత్వం ముస్లీంలకోసమే పనిచేసిందనీ, హిందూవులను రాసి రంపాన పెట్టిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం మరింత పెరిగిందని గుర్తు చేశారు.
మఖ్దూం, షోయబ్‌, బందగితో పాటు అనేక మంది నిజాం వ్యవస్థను కూల్చేందుకు పోరాడి అమరులయ్యారని గుర్తు చేశారు. జమిందార్‌, జాగీర్దార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దొడ్డికొమరయ్యలాంటి ఎందరో కార్యకర్తలు చనిపోయారన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా షోయబ్‌ అనేక కథనాలు రాశాడనీ, దీన్ని సహించలేని మూకలు అత్యంత పాషవికంగా ఆయన్ను హత్యచేశాయని తెలిపారు.ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ షోయబుల్లాఖాన్‌ నిజాం రాచరికానికి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం పోరాడారని చెప్పారు. దేశంలో మతతత్వ శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు.
అందులో భాగంగానే తెలంగాణలో నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. టీపీఎస్‌కే కన్వీనర్‌ జి రాములు మాట్లాడుతూ మతోన్మాద శక్తులు అనేక సంస్థలను ఏర్పాటు చేసి.. తమ విష భావాలను ప్రజల్లో పెంపొందించేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన వారు దీన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ రచయిత, జర్నలిస్టు స్కైబాబ మాట్లాడుతూ విలువల కోసం నిలబడ్డ వారిపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని తెలిపారు. వీరిపై కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా షోయబుల్లాఖాన్‌పై సింగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ నాయకులు సత్తార్‌,బాబర్‌ఖాన్‌,నసీర్‌, పాష, కలీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.