ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 16,296 ప్రత్యేక విడతలో 69,375 మందికి సీట్ల కేటాయింపు

– 24 కాలేజీల్లో వంద శాతం భర్తీ
– కాలేజీల్లో చేరే గడువు 29
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో గురువారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 178 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 85,671 సీట్లున్నాయని వివరించారు. వాటిలో ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నాటికి 69,375 (80.97 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 16,296 (19.03 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ప్రత్యేక విడతలో 10,535 మంది స్లైడింగ్‌ అయ్యారని తెలిపారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయకపోవడం వల్ల 1,288 మందికి సీట్లు కేటాయించలేదని వివరించారు. ప్రత్యేక విడతలో 1,966 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 5,481 మంది అభ్యర్థులు సీట్లు పొందారని వివరించారు. ఐదు విశ్వవిద్యాలయ, 19 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 24 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలనీ, ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని కోరారు. ఈనెల 29 వరకు వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. ఈనెల 29 నాటికి కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని తెలిపారు. లేదంటే కేటాయించిన సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపు, ఇతర వివరాలకు https://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
కంప్యూటర్‌ సైన్స్‌లో 90.20 శాతం సీట్ల భర్తీ
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సుల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు చేరుతున్నారు. సివిల్‌, మెకానికల్‌ వంటి కోర్సుల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 58,381 సీట్లుంటే, 52,658 (90.20 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. 5,723 (9.8 శాతం) సీట్లు మిగిలాయి.
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో 17,805 సీట్లకుగాను 12,846 (72.15 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 4,959 (27.85 శాతం) సీట్లు మిగిలిపోయాయి. సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 8,354 సీట్లుంటే 3,198 (38.28 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇంకా 5,156 (61.72 శాతం) సీట్లు మిగిలాయి. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 1,131 సీట్లకుగాను 673 (59.50 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఇంకా 458 (40.5 శాతం) సీట్లు మిగిలిపోయాయి. ఫార్మా-డీలో 412 సీట్లుంటే, తొమ్మిది మందికి సీట్లు పొందారు. ఇంకా 403 సీట్లు మిగిలాయి. బీ ఫార్మసీలో 2,473 సీట్లకుగాను 18 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 19,154 సీట్లు మిగిలిపోయాయి.