ఆశావర్కర్లకు పారితోషికాలు రూ.18 వేలకు పెంచాలి

– ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలి
– వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఆశా యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆశావర్కర్లకు పారితోషికాలను రూ.18 వేలకు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్‌.నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి వినతిపత్రం సమర్పించారు. పారితోషికం లేని అదనపు పనులను ఆశాలతో చేయించకూడదని కోరారు. టీబీ స్పూటమ్‌ డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలనీ, టీబీ, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలనీ, వాలంటీర్లను ఏర్పాటు చేయాలనీ, జాబ్‌ చార్ట్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2021 జులై నుంచి డిసెంబర్‌ వరకు 6 నెలల పీఆర్సీ ఎరియర్స్‌ వెంటనే చెల్లించాలనీ, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలనీ, 32 రకాల రిజిష్టర్స్‌ వెంటనే ప్రింట్‌ చేసి ప్రభుత్వమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాణ్యతతో కూడిన ఐదేండ్ల పెండింగ్‌ యూనిఫామ్స్‌ వెంటనే ఇవ్వాలనీ, ఆశాలకు ప్రసూతి సెలవుల కోసం సర్క్యులర్‌ జారీ చయాలనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. హెల్త్‌ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం రూ.5 లక్షల సౌకర్యం, ఆశాలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో 32 ఏండ్లుగా, మైదాన ప్రాంతాల్లో 18 ఏండ్లుగా ఆశాలు పని చేస్తూ, అనేక సార్లు శిక్షణ పొందారని వారు గుర్తుచేశారు. రిజిస్టర్స్‌ రాయడం, సర్వేలు చేయడం, ఆన్‌లైన్‌ పనిచేయడం, బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ జబ్బులను గుర్తించడం, ప్రజలకు మందులను సరఫరా చేయడం, జాగ్రత్తలు వివరిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు నిరంతర సేవలందిస్తున్న ఆశాలు కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెల్త్‌ గ్లోబల్‌ లీడర్లుగా గుర్తించిన ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కన్నా ఆశాలపై పనిభారం పెంచి, పారితోషికాలు లేని అనేక పనులను ప్రభుత్వం చేయిస్తున్నదని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో పని చేయాలని చెబుతున్న ప్రభుత్వం రూ.9,750 పారితోషికాలు మాత్రమే చెల్లిస్తున్నదని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న కాలంలో ఆశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.