రెజోనెన్స్‌ విద్యా సంస్థలలో ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని వీడియోస్‌ కాలనీలోని వేదిక ఫంక్షన్‌ హాల్‌ లో రెజోనెన్స్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ మాట్లాడుతూ ఖమ్మం నగరం అన్ని రంగాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. ఒకప్పుడు ఇక్కడ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. విద్యా, వైద్యం, తదితర కారణాలతో చుట్టూ పక్కల మండలాలు, పక్క జిల్లాల నుండి కూడా ఖమ్మంనకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు కారణం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన అభివృద్దే కారణం అన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాల్లో విద్యా, వైద్యం అద్భుతంగా అందుతుందని, ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరం ఇదే అని అన్నారు. ప్రైవేట్‌ విద్యా వ్యవస్థలు అనేకం ఇటీవలే కాలంలో రావడం ద్వారా ఉద్యోగాలు పెరిగి, ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్‌లు అర్‌.నీలిమ నాగేంద్ర కుమార్‌, శ్రీధర్‌, నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్త ఆర్జేసి కృష్ణ, డీసిసిబి చైర్మన్‌ కురాకుల నాగభూషణం, గొల్లపూడి రాంప్రసాద్‌, రాం చందర్‌, అమరగాని వెంకన్న, బత్తుల మురళీ, సంధ్య రాణి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.