– జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫిర్యాదులు అందిన ప్రతి అంశాన్నీ సవిరంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. బహదూర్‌పురా, గోషామహల్, నాంపల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై వికాస్‌రాజ్ ఆదివారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, విచారణ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిర్యాదులు అందిన ప్రతి అంశాన్ని సవివరంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను సీఈవో ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో ఎస్‌ఎస్‌ఆర్ పురోగతిని సమీక్షించారు. అన్ని జిల్లాల్లో18-19 ఏండ్ల వయస్సు గల వారి నమోదు, 18-19 ఏండ్ల లింగ వివరాలు, ఓటర్ల జాబితాలో వికలాంగుల ఓటర్లను గుర్తించడం, ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల నమోదులో వందశాతం కృషి చేయాలని కోరారు.
ముఖ్యంగా 18-19 ఏండ్ల యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వివిధ ప్రచార పద్ధతులను పాటించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంతోపాటు తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారులందరినీ సీఈవో ఆదేశించారు. దీంతోపాటు సీఈఓ కార్యాలయం, ఈసీఐ నుంచి ఫార్వార్డ్ చేయబడిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి, ఆలస్యం చేయకుండా వాస్తవ నివేదికను సీఈఓ కార్యాలయానికి పంపాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు తక్షణమే ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.