– డీసీపీ వి.శ్రీనివాసులు. సీఐ జి.చరమందరాజు గౌడ్
– స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలుగా ఎంపికైన అభ్యర్థులకు సన్మానం
నవతెలంగాణ-ఆమనగల్
నిరుద్యోగ యువతీ యువకులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీసీపీ వి.శ్రీనివాసులు, సీఐ గజ్జె చరమందరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఆమనగల్ పట్టణంలోని మాస్టర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఎస్‌ఐలుగా ఎంపికైన ఆమనగల్ కడ్తాల్ మండలాలకు చెందిన కే.మధు, యు.రాకేష్, ఎన్.దేవేందర్, యు.సునీత, జి.లింగంగౌడ్, శ్రీకాంత్, సీహెచ్.శ్రీను తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ డీసీపీ వి.శ్రీనివాసులు, స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, నల్లగొండ జిల్లా విజిలెన్స్ సీఐ గజ్జె చరమందరాజు గౌడ్ హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించడానికి ప్రణాళికతో చదివి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో సహకారం అందించేందుకు స్నేహ హస్తం ఫౌండేషన్ ఎప్పుడూ ముందు ఉంటుందని వ్యవస్థాపక అధ్యక్షులు సీఐ చరమందరాజు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు తల్లోజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య, కోశాధికారి లింగంపల్లి ఆనంద్, కార్యవర్గ సభ్యులు పున్న వెంకటేష్, విడియాల ఆనంద్, సిరందాసు జగదీశ్వర్, ధనరాజ్, కళాశాల ప్రిన్సిపాల్ జటావత్ చందు నాయక్, ప్రముఖ ఇంగ్లీష్ ఆధ్యాపకులు అవ్వారి శివలింగం పాల్గొన్నారు.