ప్రమాదాలకు నిలయంగా ఆర్‌ఓబి బ్రిడ్జి

– పట్టించుకోని అధికారులు..రోజూ ప్రమాదాలే..!
నవతెలంగాణ – బోనకల్‌
మండల కేంద్రంలో గల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. అయినా అధికారులు ఎవరో పట్టించుకోకపోవడం పట్ల ప్రయాణికులు, మండల ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని 2014లో ప్రారంభించారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించి కేవలం 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల వ్యవధిలోనే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలల క్రితం బీటీ రోడ్డు మరమత్తు పనులు చేశారు. మిగిలిన రోడ్డు మరమ్మత్తు పనులు చేయకుండానే వదిలేశారు. జాయింట్‌ కలిపే వద్ద పెద్దపెద్ద గుంతల పడి ప్రమాదకరంగా మారాయి. మరికొన్ని చోట్ల స్లాబ్‌ ఇనుప చువ్వలు పైకి లేసి ప్రమాదకరంగా మారాయి. రోడ్డు జాయింట్‌ వద్ద పెద్ద పెద్ద గుంతల పడి ద్విచక్ర వాహనాలు వెళ్లే సమయంలో ఆ గుంతలో పడి ప్రమాదానికి గురవుతున్నాయి. కనీసం ప్రతిరోజు రాత్రి సమయంలో ఐదారు ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిరోజు మండల, జిల్లా స్థాయి అధికారులు ఈ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీదుగానే వెళ్తున్నారు. కానీ పట్టించుకోవడం లేదు. ఎన్నికల కంటే ముందే ఆర్వోబి బ్రిడ్జి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బి అధికారులతో సహా ఏ అధికారి పట్టించుకోలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో ఎన్నికలు అయిపోయే వరకు ఈ రోడ్డు పరిస్థితి గురించి పట్టించుకునే నాధుడే ఉండడని ప్రయాణి కులు, మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తా కథనాలు వచ్చిన సందర్భంలో తూతూ మంత్రంగా మరమత్తు పనులు చేయటం తప్ప ఆ తర్వాత పట్టించుకున్న నాధుడే ఉండటం లేదని ప్రయా ణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ఎన్ని ప్రమాదాలు జరిగిన, ఎంతమంది గాయపడిన, ఎంతమంది మృత్యువాత పడిన తమకు సంబంధం లేదన్నట్లుగా ఆర్‌అండ్‌బి అధికా రులు, ప్రభుత్వం తీరు ఉందని ప్రయాణికులు, ప్రజా ప్రతినిధులు అంటున్నారు.