అమరుల ఆశయాలకనుగుణంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ

– విలీనానికి ముందే బకాయిలు విడుదల చేయాలి
– ఆర్టీసీ జేఏసీ నాయకుల డిమాండ్‌
– సూర్యాపేట డిపోలో అమరులకు నివాళి
నవతెలంగాణ-సూర్యాపేట
ఆర్టీసీ సమ్మె సందర్భంగా 2019లో అమరులైన కార్మికుల ఆశయాలకు తగ్గట్టుగా సంస్థ విలీన ప్రక్రియ చేపట్టి విధివిధానాలు ఖరారు చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిపోలో కార్మికులు అమరుల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎనలేనిదని, బస్సు చక్రం ఆగితేనే తెలంగాణ సాధించుకోగలిగామని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో కూడా హక్కుల కోసం, సమస్యల పరిస్కారం కోసం ఉద్యమాలు తప్పలేదన్నారు. 2015, 2019లో సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పోరాటంలో 35 మంది కార్మికులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సంస్థను, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడం స్వాగతిస్తున్నామని తెలిపారు. కానీ అమరులు ఆశించిన విధంగా విలీన ప్రక్రియ చేపట్టి కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2017, 2021 వేతన సవరణ చేసి, 2013 వేతన సవరణ బకాయిలు, సీసీఎస్‌, పీఎఫ్‌ తదితర బకాయిలను విలీనానికి ముందే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వేసిన ఉపసంఘం కార్మిక సంఘాలతో చర్చించి మెరుగైన వేతనాలు, సర్వీస్‌ కండిషన్స్‌ ఇవ్వాలన్నారు. ఆర్టీసీ విస్తరణ కోసం కొత్తబస్సులను కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బత్తుల సుధాకర్‌, డోన్‌వాన్‌ రవికుమార్‌, లచ్చయ్య, పీఎం రావు, సేవ్య, లక్ష్మయ్య, రాఘవులు, హనుమంత్‌, శ్రీకంట్లం, రమేశ్‌, నాగిరెడ్డి, పరుశరాములు, ఇంద్రయ్య, పీసీ శేఖర్‌, అజారుద్దీన్‌, స్వామి వెంకన్న, టీజేఎం రెడ్డి, నాగేందర్‌, మంజుల, సైదమ్మ, రూపావతి, ఇందిర పాల్గొన్నారు.