రాష్ట్ర సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర

– సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారు
– దశాబ్ది ఉత్సవాల్లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్రని, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌ అన్నారు. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనికాయన ముఖ్య అతిథి హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ప్రజల సహకారం, ఉద్యోగుల కృషితో టీఎస్‌ఆర్టీసీకి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, సీఎంఈ రఘునాథరావు, చీఫ్‌ మేనేజర్‌ ప్రాజెక్ట్స్‌ విజరు కుమార్‌, సీటీఎం జీవనప్రసాద్‌, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ప, బిజినెస్‌ హెడ్‌ సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.