ప్రతి నెలా జీతాలకు ఆలస్యమే

– ప్రత్యేక పీడీ లేకపోవడంతో పెండింగ్‌లో ఫైల్‌
– ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో జీతం ఏ రోజు వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఇదే తంతు కొనసాగుతుం డటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. శాక్స్‌ ఉద్యోగుల జీతాలపైన సంతకం చేయ లేనంత బిజీలో ఇన్‌ ఛార్జీ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉండడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తున్నది. గత 10 రోజుల నుంచి జీతాల ఫైల్‌ నుంచి తీసుకుని ఆమె కార్యాలయానికి వెళితే, ఇంటికి తీసుకురా వాలనీ, అక్కడికి వెళితే మరుసటి రోజు కార్యాల యానికి తీసుకురావాలని చెబుతున్నట్టు సమా చారం. ఎప్పుడు ఏదో ఒక సమావేశంలో ఉన్నాను…. ఇప్పుడు ఆ ఫైల్‌ చూడను అంటూ వెనక్కి పంపిస్తుండటంతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. మరోవైపు టీశాక్స్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతామహంతి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. టీశాక్స్‌ కు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా నియమిస్తే జీతాల జాప్యం సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను కూడా అధిగమించ వచ్చనే సూచనలు వస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా 20వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల ఇంటి అద్దె, హౌమ్‌ లోన్లు, ఇతర ఈఎంఐలు కట్టలేక డిఫాల్టర్లుగా మిగిలిపోవాల్సి వస్తున్నది. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ ఆర్గనైజేషన్‌ (న్యాకో) నిబంధనల మేరకు ఉద్యోగులకు ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలివ్వాల్సి ఉంటుంది. దానికి అంతకు ముందు నెలలో 20వ తేదీ తర్వాత జిల్లాల వారీగా హాజరు పట్టికను రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థకు చేరుతుంది. ప్రతి నెలా 30వ తేదీ వరకు జీతాలకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేస్తారు. మరుసటి నెల ఒకటో తేదీ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఫైల్‌పై సంతకం చేసి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆమోదంతో జీతాల ఫైల్‌ బ్యాంకుకు పంపించడం ఆనవాయితీ. ఈ సొసైటీ పరిధిలో 750 మందికి పైగా పని చేస్తు న్నారు. వీరిలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషి యన్లు, కౌన్సిలర్లు, ఫార్మాసిస్టులు, కేర్‌ కో ఆర్డినేటర్‌ వంటి కేడర్లలో ఉండి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో, ఐసీటీసీ, పీపీటీసీపీ, బ్లడ్‌ బ్యాంక్‌, ఏఆర్‌టీ సెంటర్లు తదతర విభాగాల్లో ఉంటూ హెచ్‌ఐవీ మందుల సరఫరా తదితర సేవలందిస్తు న్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది సకాలంలో జీతాలు అందేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.