ప్రయివేటు పాలకు పట్టం పడిపోయిన ప్రభుత్వరంగ డెయిరీల అమ్మకాలు

– గురుకులాల కాంట్రాక్టు ఆ డెయిరీలకే..
– పుట్టగొడుగుల్లా ప్రయివేటు మిల్క్‌ సెంటర్లు
– పట్టించుకోని అధికార యంత్రాంగం
– పెద్దగా కన్పించని విజయ, నార్మూల్‌
ప్రయివేటు మిల్క్‌ సెంటర్ల పాల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అధికారులు సైతం ప్రభుత్వ రంగం మిల్క్‌ డెయిరీలను పక్కన పెట్టారు. ప్రయివేటు మిల్క్‌ డెయిరీలను ప్రోత్సహిస్తూ గురుకుల విద్యాసంస్థలకు ఆ పాలనే సరఫరా చేస్తున్నారు. అధికారులు ప్రయివేటు డెయిరీలకు గురుకుల విద్యాసంస్థలకు కాంట్రాక్టు అప్పగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాల బిజినెస్‌ ఎవర్‌ గ్రీన్‌గా మారిపోయింది. వినియోగిస్తున్న పాలకు చెందిన కొన్ని మిల్క్‌ డెయిరీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. కానీ ఎక్కడా చూసినా ఆ కంపెనీల పాల ప్యాకెట్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ డెయిరీలైన విజయ, నార్మూల్‌ పాల ప్యాకెట్లు కొనుగోలు చేద్దామన్నా కనిపించడం లేదని వినియోగదారులు అంటున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
15 లక్షల లీటర్లకు పైగా పాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవీకాకుండా అదనంగా బయటి నుంచి వచ్చిన లక్షలాది పాల ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి. వాస్తవంగా చూస్తే.. పాల వ్యాపారంలో ప్రయివేటు డెయిరీలది 90 శాతం వాటా ఉంటే.. విజయ, నార్మూల్‌ (మదర్‌) డెయిరీల వాటా 10 శాతానికి మించడం లేదు. మదర్‌ డెయిరీ పాల ప్యాకెట్లు కొన్నిచోట్ల కనిపిస్తున్నా.. విజయ డెయిరీ పాల ప్యాకెట్లు మాత్రం మచ్చుకైనా కానరావడం లేదు.
గురుకులాలకు ప్ర్రయివేటే..
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు రోజూ అందించా ల్సిన పాల కోసం టెండర్లను సైతం అధికార యంత్రాంగం ప్రయివేటు మిల్క్‌ డెయిరీలకు కట్టబెట్టడం గమనార్హం. క్వాలిటీ విషయంలో టాప్‌లో ఉండే ప్రభుత్వరంగ డెయిరీ లను కాదని.. అసలు ఎక్కడి నుంచి పాలను సేకరిస్తున్నారో తెలియని.. ప్రయివేటు మిల్క్‌ డెయిరీలకు అధికారులు టెండర్లు ఓకే చేయడం వివాదాస్పద మవుతోంది. లీటరు పాలకు రూ.2 తగ్గుతుందనే సాకుతో ఇటీవల గురుకుల పాల టెండర్లను కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
పుట్టగొడుగుల్లా ప్రయివేటు మిల్క్‌ సెంటర్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రయివేటు మిల్క్‌ డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కనీస ప్రమాణాలు పాటించడం సంగతి పక్కనపెడితే.. అవి నిజంగా పాలేనా..? లేక కెమికల్స్‌తో తయారు చేసి ప్యాకెట్ల లో నింపి సరఫరా చేస్తున్నారా…? అన్నది తెలియదు. యూరియా, సర్ఫ్‌ తదితర కెమికల్స్‌తో పాలను తయారు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయాలు జరిపిన ఘటనలు బహిర్గతమైన దాఖలాలు లేకపోలేదు.
నల్లగొండ, సూర్యా పేట, యాదాద్రిభువనగిరి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, నకిరేకల్‌, తిరుమలగిరి, మిర్యాలగూడ, హాలియా, కోదాడ పట్టణాల్లో ప్రయివేటు మిల్క్‌ డెయిరీలదే హవా.
ప్రభుత్వ రంగ డెయిరీల బలోపేతమేదీ..?
పాడి రైతాంగాన్ని ప్రోత్సహించడంతో పాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వరంగ డెయిరీలు నడుసున్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మదర్‌ డెయిరీ, విజయ డెయిరీ పాలకు మంచి డిమాండ్‌ ఉంది. హాట్‌ కేకుల్లా విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల సేల్స్‌ ఉంటాయి. అయితే, కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలో విజయ, నార్మూల్‌ డెయిరీ ఉత్పత్తులు కన్పించడం లేదు. సదరు డెయిరీలు రోజురోజూకీ ఆర్థికంగా చితికిపోతు న్నాయి. వీటిని బలోపేతం చేయాలంటే ఏకైక మార్గం.. సేల్స్‌ పెంచడమే. ప్రయివేటు డెయిరీల పాలు, ఉత్పత్తుల వినియోగం రోజు రోజుకూ పెరుగుతూ లాభాలు గడిస్తుంటే.. ప్రభుత్వ రంగ డెయిరీ ఉత్పత్తుల విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.