పింఛన్‌ పెంపుతో దివ్యాంగుల సంబురాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దివ్యాంగుల పింఛన్‌ మరో వెయ్యి రూపాయలు పెంచుతూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమైంది. ఈపెంపుతో దివ్యాంగుల ఫించన్‌ మొత్తం రూ.4,116కు చేరుతుందనీ, వారికి ఆర్థిక భరోసా కలుగుతుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచుకొని, సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలు తెలుసుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.40 లక్షల మంది దివ్యంగులకు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. దానితోపాటు వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర దివ్యాంగుల సంఘాల నాయకులు మున్న, రాజ్యలక్ష్మి, అంధుల ప్రతినిధులు భాస్కర్‌, మహేందర్‌, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.