– భూమి స్వాహా చేసేందుకు స్కెచ్
– చక్రం తిప్పిన ఓ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే?: కలెక్టర్ బదిలీ అందుకేనా? అంటూ ప్రచారం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కాందిశీకుల భూములను మాయం చేసేందుకు పెద్ద పథకమే నడిచింది. ఎప్పుడో స్వాతంత్య్ర కాలంలో కేటాయించిన భూమిని కాజేసేందుకు వారసులంటూ తెరపైకొచ్చారు. దీని వెనుక యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన ఇసుక కాంట్రాక్టర్ స్కెచ్ వేశారని సమాచారం. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోని కాందిశీకుల భూమిని కాజేయాలనే పన్నాగంలో ఓ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సహకరించి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అందుకు సహకరించనందునే యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతిపై బదిలీ వేటుపడినట్టు ప్రచారమూ జరుగుతోంది.
కాందిశీకుల భూస్వాహా వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అంతా తానై వ్యవహరించినట్టు తెలుస్తోంది. కాందిశీకుల భూమిని స్వాహా చేయాలనే కుట్రకు సాండ్ కాంట్రాక్టర్ తెరలేపితే.. మిగతా వ్యవహారన్నంతా సదరు ఎమ్మెల్యే తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తహసీల్దారు నుంచి ఆర్డీఓ, కలెక్టర్ వరకు ఒత్తిడి తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కలెక్టర్ ససేమిరా అనడం.. తాను ఇబ్బందుల్లో పడతానని సుతిమెత్తగా తిరస్కరించడంతో ఆ ఎమ్మెల్యేకు కోపమొచ్చిందట. దీంతో అప్పటికప్పుడు వెయిటింగ్ జాబితాలో ఉన్న మరో కలెక్టర్‌ను యాదాద్రిభువనగిరి జిల్లాకు తీసుకొచ్చారని రాజకీయ సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..?
దేశ విభజన సమయంలో ఇండియాను వదిలివెళ్లిపోయిన వారికి సంబంధించిన భూములను పాకిస్థాన్ నుంచి వలసొచ్చిన కాందిశీకులకు ఇచ్చేందుకు అప్పటి భారత ప్రభుతం నిర్ణయించింది. అందులో భాగంగానే పాకిస్థాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన రాథాబాయి, తహిల్మిల్ కుటుంబాలకు చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ గ్రామపరిధిలోని 401 ఎకరాలను 1952లో కేటాయించింది. అయితే, మహారాష్ట్రలోని కల్యాణ్‌లో రాధాబాయి, కొల్హాపూర్‌లో తహిల్మిల్ కుటుంబాలు స్థిరపడిపోయాయి. రాధాబాయి కుటుంబానికి 141 ఎకరాలు, తహిల్మిల్ కుటుంబానికి 260 ఎకరాలను కేటాయించగా, వారు వాటిని ఏనాడూ సేద్యం చేసుకున్న దాఖాలాల్లేవు. కనీసం తమ భూములకు హద్దురాళ్లు పాతుకున్న సందర్భాలు లేవు. దీంతో నాటి నుంచి ఆ భూములను నిషేధిత జాబితాలో పెడుతూ వస్తున్నారు.
ఆకాశం నుంచి ఊడిపడిన వారసులు
ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా సదరు కాందిశీకుల కుటుంబాలకు వారసులమంటూ కొంతమంది యాదాద్రిభువనగిరి జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదించారు. నిజానికి సర్వే నంబరు 115, 123, 137, 141, 267లో 141.14 ఎకరాలు కల్యాణ్‌కు చెందిన రాధాభాయికి కేటాయించినవి. సర్వే నంబరు 114లో 260.12 ఎకరాలను కొల్హాపూర్‌కు చెందిన తహిల్మిల్‌కు కేటాయించినవి. అప్పటి నుంచి రెవెన్యూ అధికారులు వారి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ చేస్తూ వచ్చారు. 1955-58 నాటి చెస్సాల పహాణీలోని పట్టేదార్ యజమాని కాలంలో వారి పేర్లు నమోదు చేశారు. తాజాగా వచ్చిన ధరణి రికార్డుల వరకు వారి పేర్లే నమోదవుతూ వచ్చాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది అక్రమార్కులు.. వారసుల పేరుతో కొంతమందిని రంగప్రవేశం చేయించినట్టు తెలుస్తోంది. వచ్చినోళ్లు అసలైన వారసులా? కాదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. వారసులు నిజమో కాదో తేల్చాలంటూ యాదాద్రి కలెక్టర్ 2019లో మహారాష్ట్రకు చెందిన అక్కడి కలెక్టర్లు ఇద్దరికీ లేఖ రాశారు. కానీ నేటికీ సమాధానం రాకపోవడం గమనార్హం.