పారిశుధ్య కార్మికుల కష్టాలు తక్కువ వేతనాలు.. అధికపని

– కనుమరుగవుతున్న పీఎఫ్‌ నిధులు
– దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్మికులు
జంషెడ్‌పూర్‌ : జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో పారిశుధ్యకార్మికులు దయనీయ పరిస్థితులను అనుభవిస్తున్నారు. తక్కువ వేతనాలు, అధిక పని, అణచివేతను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వారి పీఎఫ్‌ నిధులు కనుమరుగవుతున్నాయి. పారిశుధ్య కార్మికుల్లో అత్యధికం అట్టడుగు కులాల వారే ఉన్నారు. దీంతో ఈ పరిస్థితులతో వారు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఓ ప్రయివేటు బ్యాంకులో సఫాయి కర్మచారిగా పనిచేస్తున్న జంషెడ్‌పూర్‌కు చెందిన రమేష్‌ కార్మికుల అవస్థలను వివరించారు. ”నేను గత ఎనిమిదేండ్లుగా అదే జీతం పొందుతున్నాను. నేను లేకుండా, బ్యాంకు ఒక రోజు కూడా పనిచేయదు. అయినప్పటికీ, నా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది” అని అతను వాపోయాడు. బ్యాంకులో ఇతర ఉద్యోగులు జీతంలో వార్షిక పెంపుదల పొందుతున్నారనీ, తాను మాత్రం అదే ఆదాయంతో స్థిరపడవలసి వస్తున్నదని చెప్పారు. జంషెడ్‌పూర్‌లోని ఇతర పారిశుధ్య కార్మికుల పరిస్థితులు కూడా రమేశ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నాయి.
1900 ప్రారంభంలో ప్రయివేటు కంపెనీలు యూపీ, బీహార్‌ బెల్ట్‌ నుంచి కార్మికులను నియమించుకున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎలాంటి నేపథ్య తనిఖీ లేకుండా నియమించబడ్డారు. వారందరికీ శాశ్వత ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, వారి కుటుంబాలు నివసించడానికి క్వార్టర్లు కల్పిస్తామని వాగ్దానం చేయబడ్డాయి. అయితే, ఈ ప్రయోజనాలు కార్మికులు, అధికారులకే పరిమితం చేయబడ్డాయని పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. ముఖి పట్టణకార్యాలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా పని చేస్తున్న సాగర్‌ మాట్లాడుతూ.. మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చి మాపై వివక్ష చూపటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అణగారిన సామాజిక వర్గాలను అదే శుభ్రపరిచే ఉద్యోగాలకు పరిమితం చేసినప్పటి నుంచి వారి ఆర్థిక స్థితి ఏ మాత్రమూ మెరుగుపడలేదని వివరించాడు. ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు పనిచేస్తున్నప్పటికీ వారి పిల్లలకు మెరుగైన విద్య, మెరుగైన జీవితాన్ని అందించడానికి ఆదాయం ఏ మాత్రమూ సరిపోవటం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తాము మాత్రం వారికి చాలా తక్కువ అని అన్నాడు.
ఆరు నెలల క్రితం వరకు ఓ కాంట్రాక్టర్‌ కింద పనిచేసిన సుమన్‌దేవి అనే మహిళ మాట్లాడుతూ.. పని ప్రదేశంలో తాను ఎదుర్కొన్న దోపిడీ గురించి వాపోయింది. చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయనీ, కుటుంబాన్ని పోషించుకోవటం కష్టంగా మారిందని వివరించింది. ఆమె ఇద్దరు కుమారులు కూడా అక్కడే స్వీపర్లుగా పని చేస్తున్నారు. వేతనాలు సరిగ్గా సమయానికి అందటం లేదనీ, ఇక పీఎఫ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. బోనస్‌లు, సెలవులు వంటివి లభించటం కష్టంగా ఉన్నదన్నారు. అయితే, పారిశుధ్య కార్మికుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.