నవతెలంగాణ-నవాబుపేట్
ఆరోగ్య చేవెళ్ల సాధనలో భాగంగా ఆదివారం నవాబ్ పేట మండలం చించేల్ పేట్ గ్రామంలో ఎమ్మెల్యే స్వగ్రామంలో ఆరోగ్య రథం ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య రథం పేద ప్రజలకు సంజీవనీ వరం లాంటిదని ఆస్పత్రికి పోలేని వాళ్లకు ఇది గొప్ప వరమని నేరుగా మన గ్రామానికి హాస్పటల్ వచ్చిందని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత నిధులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ ఆరోగ్య రథన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వైద్య ఆరోగ్యానికి సైతం పెద్దపీట వేసిందని అన్నారు. చేవెళ్లల్లో వంద పడకల ఆస్పత్రి మంజూరు అయిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, తాగునీరు, సాగునీరు కొదవ లేకుండా ఉందని ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కాలే భవాని, జడ్పీటీసీ కాలే జయమ్మ, రాంరెడ్డి, నాగిరెడ్డి, ప్రశాంత్ గౌడ్, రంగారెడ్డి, కాలే శ్రీనివాస్, భల్వంత్ రెడ్డి, రఫి, రాంచంద్రయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.