సినిమా అంటే వినోదాత్మకంగానే కాదు ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత డా. సదానంద్ శారద ఎస్-3 క్రియేషన్స్ పతాకంపై శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ’ ఉరఫ్ కారంచారు.
శాన్వి మేఘన, కౌశిక్ బాబు జంటగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను శాసన సభ్యులు ముఠా గోపాల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సామాజిక అంశంతో సినిమా నిర్మించిన దర్శక, నిర్మాతలను అభినందిస్తున్నా.. ఆడపిల్లను ఒక చైతన్య మూర్తిగా, ప్రతిభావంతంగా టీజర్లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్ధిని పాత్రలో శాన్వి మేఘన పవర్‌ఫుల్‌గా నటించింది. టీజర్, టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం విజయవంతమవ్వాలి’ అని అన్నారు.
‘ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్షత చూపేవారికి ‘తాగిస్తం కారంచారు’ అంటూ నాయిక సరోజ గుణపాఠం చెబుతుంది’ అని దర్శకులు శ్రీ మాన్ గుమ్మడవెల్లి చెప్పారు. రచయిత, నిర్మాత డా సదానంద్ శారద మాట్లాడుతూ, ‘వరంగల్ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు, హద్యమైన సంగీతం, ఆలోచనాత్మక సంభాషణలు, శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు, ఆర్.యస్.నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల సెన్సార్ పూర్తయి ‘యు’ సర్టిఫికెట్ పొందింది’ అని తెలిపారు.