నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో రైతులను భాగస్వామ్యులను చేయాలని అశ్వారావుపేట సొసైటీ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ డైరెక్టర్లకు సూచించారు. సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో బుధవారం ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. వారోత్సవాలను పురష్కరించుకుని 2014 నుండి 2023 వరకు సహకార సంఘం ద్వారా రైతులను అందించిన సేవలను వివరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ,అనుబంధ రంగాల అభివృద్ధి,రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ఇందుకు రైతు బంధు, రైతు భీమా, మద్దతు ధరకు పంటల కొనుగోళ్ళు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు రుణాలు పంపిణీ, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా నివారణ చర్యలను ప్రధానంగా ఉదాహరించారు. సమావేశంలో సీఈవో మానేపల్లి విజయబాబు, పలువురు డైరెక్టర్లు, ఏ.ఈ.వో లు పాల్గొన్నారు.