ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ కి స్వంత భవనాలను నిర్మించాలి

– ఎస్ఎఫ్ఐ డిమాండ్ 

నవతెలంగాణ- కంటేశ్వర్
ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ హాస్టల్ కి సొంత భవనాలను నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమీకృత కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి, ఎస్సీ ఎస్టీ బీసీ శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర కార్యదర్శి పోశమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ నగర కేంద్రం ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా ఉండి అనేక వేల మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.అయితే విద్యార్థుల సంఖ్య కనుగుణంగా సంక్షేమ హాస్టల్లో సీట్లు లేక బయట హాస్టల్లో ఉండలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా ఉన్న హాస్టల్స్ కూడా కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, కొన్ని మరమ్మత్తులు చేయాల్సినటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి. అలాగే సంక్షేమ హాస్టల్లో ప్రతినెలకోసారి ఎంబీబీఎస్ డాక్టర్ చే హెల్త్ క్యాంపు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మెస్, కాస్మోటిక్ చార్జీల బిల్లులను విడుదల చేయాలని, విద్యార్థుల సంఖ్య కనుగుణంగా హాస్టల్లో సీట్ల సంఖ్య పెంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల హాస్టల్ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు విశాల్ నగర ఉపాధ్యక్షులు దీపిక ,గణేష్ నగర నాయకులు శ్రీకాంత్ ,సాయికిరణ్ ,సజన్ ,కార్తీక్ మరియు హాస్టల్ కమిటీ నాయకులు శివ, బాబురావు ,సజన్ తదితరులు పాల్గొన్నారు.