జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే

– వారణాసి కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు ఆవరణలో గతంలో మూసివేసిన ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతంలో భారత పురావస్తు శాఖ శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి కోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. కోర్టు ఆదేశాలతో జరిగిన వీడియో సర్వేలో హిందూ మహిళలు చెబుతున్న శివలింగం లేదా ముస్లింలు చెబుతున్న ఫౌంటేన్‌ వున్నట్టు కనుగొనడంతో మసీదు ఆవరణలో ఆ స్థలాన్ని మూసివేయాలని కోర్టు గతంలో జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ ఏడాది మేలో ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. అంతకుముందు ఈ మహిళలే మసీదు ఆవరణలోని శృంగార గౌరి స్థల్‌ వద్ద ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్‌పై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) వీడియో సర్వే చేయాలని ఆదేశించారు. అది గతేడాది మే 16తో పూర్తయింది.