– వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
గృహలక్ష్మి పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు టీంలను ఏర్పాటు చేసుకొని సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన పనులను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, గహలక్ష్మి పథకం ద్వారా రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలన్నారు. మండలాల వారిగా ఈ రోజు టీంలను ఏర్పాటు చేసుకొని స్కూట్నీ పనులు చేపట్టాలన్నారు. సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి వారం రోజులలో పూర్తి చేయాలని సూచించారు. మండలాల వారిగా ప్రతి టీంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, ఏపీఎంలు ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, ఏఈ స్థాయి అధికారులు ఉండాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలన్నారు. దరఖాస్తులో తప్పనిసరిగా రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, సొంత ఇంటి స్థలంతో పాటు స్థానికంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను నిబంధనల మేరకు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. గహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, ఇంటి పని పూర్తయిన తర్వాత లక్ష రూపాయల చొప్పున మూడు విడతలుగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలియజేశారు. లబ్దిదారుడు తప్పనిసరిగా రెండు రూములు, ఒక మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ప్రత్యేక బ్యాంకు అకౌంట్లను ప్రారంభించాలని సూచించారు.
వెనుకబడిన తరగతుల లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను నియోజకవర్గాల వారిగా పంపిణీ కార్యక్రమం వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 0-23 సంవత్సరాల లోపు గల అనాధ పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సోమవారం వరకు పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ కార్యదర్శులు సర్వేను నిర్వహించాలన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రతి మండలానికి 25 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుండి 15 వరకు చేపట్టి పూర్తి చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు. నాణ్యమైన పెద్ద సైజు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు.సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, వికారాబాద్, తాండూర్ ఆర్డిఓలు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు