– వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జి వీసీ
– ఈ నెల 7, 8, 9న కౌన్సెలింగ్
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో 2023-24విద్యా సంవత్సరానికిగాను పీయూసీ మొదటి సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల ప్రవేశాల జాబితాను సోమవారం ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ విడుదల చేశారు. యూనివర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.1404 సీట్లకుగాను, 13,538 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎంపికైన 1404 మంది విద్యార్థుల వివరాలు తెలిపారు. బాలికలు 67శాతం సీట్లు, బాలురులు 33 శాతం సీట్లు పొందారన్నారు. ఆర్జీయూకేటీలో 99 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పొందినట్టు తెలిపారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 322 సీట్లు దక్కగా, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాకు 2 సీట్లు వచ్చాయని తెలిపారు. నిర్మల్ జిల్లాకు 92 సీట్లు వచ్చాయన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఈనెల 7, 8, 9 తేదీల్లో 500 మంది విద్యార్థుల చొప్పున యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని, రాబోయే సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉంటరాని తెలిపారు. విద్యార్థులకు 2,200ల్యాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేశామని, తరగతి గదుల మరమ్మతు పూర్తి చేసినట్టు చెప్పారు. సమావేశంలో ఆయా విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.