రూ.1 లక్షా 43వేల కోట్లిస్తాం… డిస్కంలను అమ్మేయండి

 We will give Rs.1 lakh 43 thousand crores... Sell ​​discs– రాష్ట్రాలకు మరోసారి కేంద్రం ఆఫర్‌
–  సంస్కరణల అమలు పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టే యత్నం
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
దేశంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థల్ని (డిస్కంలు) కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది. విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టక ముందే, అది చట్టరూపం దాల్చకుండానే సంస్కరణల పేరుతో దానిలోని అంశాలను అమలు చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. దానిలో భాగంగా ఆర్థిక సహకారం పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ముగ్గులోకి దించేందుకు శతధా ప్రయత్నిస్తోంది. తాజాగా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలుగా ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వద్ద రూ.1,43,332 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తమానం పంపారు. సంస్కరణల అమలును వ్యతిరేకిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను మరింత ఊరించేందుకు ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాలకు రూ.66,413 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామనీ తెలిపారు. సంస్కరణలు అమలు చేస్తే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ప్రస్తుతం ఉన్న 0.25 శాతం ప్రోత్సాహకాలను 0.5 శాతానికి పెంచేలా అర్హత కల్పిస్తామనీ పేర్కొన్నారు. రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న ఈ కరుణకు కారణం డిస్కంలను పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడమే. దానిలో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా వర్తమానాలు పంపారు. గతంలో చెప్పినట్టే మోటార్లకు మీటర్లు పెట్టాలని పేర్కొన్నారు ప్రస్తుతం గ్యాస్‌ వినియోగదారులకు ఏ రూపంలో అయితే సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నాయో అదే పద్ధతిని సబ్సిడీ పొందుతున్న విద్యుత్‌ వినియోగదారులకూ వర్తింప చేయాలని షరతు విధించారు. కేంద్రప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పేరుతో ఇప్పటికే గ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న విషయం తెలిసిందే. క్రమేణా ఈ సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేసి, ఇప్పుడు నామమాత్రంగా రూ.37 నుంచి రూ.45 మధ్య మాత్రమే ఖాతాల్లో జమచేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు కరెంటు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలను
కుదించేయాలనే షరతును విధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలనీ, విద్యుత్‌ పంపిణీ సంస్థల సగటు విద్యుత్‌ సరఫరా, కొనుగోలు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేయాలని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా డిస్కంల ఆధీనంలో ఉన్న కరెంటు స్తంబాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటన్నింటినీ ఫ్రాంచైజ్‌ల పేరుతో ప్రయివేటుకు ఇవ్వాలనే ప్రమాదకరమైన షరతును విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ సంస్కరణలు అమలు చేసేందుకు అంగీకరిస్తే, కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఉన్న రూ.1,43,332 కోట్ల ప్రోత్సాహక నిధుల్ని రాష్ట్రాల వారీగా ఇచ్చేందుకు సిద్థంగా ఉన్నట్టు తెలిపారు. ఇవే అంశాలతో ఈ ఏడాది జూన్‌ 28న కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.