– నిందితులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొంపెల్లిలో ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శింక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాకు బతుకుదెరువుకోసం వలసొచ్చి కొంపల్లిలో నివాసముంటూ కూలిపని కోసం తల్లిదండ్రులు వెళ్లగా.. పక్కింట్లో ఉంటున్న తండ్రీ, కొడుకు పాపపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఇంతటి దుర్మార్గమైన ఘటనపట్ల పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మంజుల హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
మంజుల హత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాయిఎన్‌క్లేవ్ ప్రాంతంలో గురువారం రాత్రి మంజుల అనే మహిళను హత్యచేసి, డీజిల్ పోసి, మృతదేహాన్ని తగుల బెట్టడం దారుణమని పేర్కొన్నారు. శంషాబాద్ ఏరియాలో జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని ఇటువంటి అనేక దారుణాలు జరుగుతున్నాయనీ, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
లైంగిక దాడులపై చర్యలు తీసుకోవాలి- మహిళ కమిషన్‌కు తెలుగు మహిళల వినతి
నవతెలంగాణ – హైదరాబాద్
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భద్రత కలిపించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు టీడీపీ తెలుగు మహిళా సంఘం విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శనివారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నిరంతరం జరుగుతున్న అఘయిత్యాలను ప్రభుత్వం నిరోధించాలని కోరారు. అలా కాకుండా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
కార్యాలయంలో కమిషన్ చైర్‌పర్సన్ అందుబాటులో లేక పోవడంతో ఆఫీస్ ఇన్‌ఛార్జి అరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంకు ఇందిరా, నిర్మలా గౌడ్, కార్యాలయ కార్యదర్శి శాంతి, కార్యనిర్వాహక కార్యదర్శులు లలితా తగిరిశ, కార్యదర్శులు కనక దుర్గ, వట్టినేని సురేఖ, శీలం రత్న, స్వాతి తదితరులు పాల్గొన్నారు.