షహర్‌ కా ఖయాల్‌

షహర్‌ కా ఖయాల్‌రాత్రుళ్ళేకాదు పగలూ వెలిగే నక్షత్రాకాశం జాఫర్‌ బావులమీద పావురం..
వెదజల్లిన ఆకలిగింజలు ఇళ్ళూ వీధులు..
నగరం కన్నుమలగని అమ్మ
అర్ధరాత్రైనా.. సగంతీసిన తలుపు.. తెరిచిన ఖురాన్‌
పూర్తికాని కల్మా సాగుతున్న నమాజు.. కనపడీ కనపడని కళ్ళద్దాలు
ఒక్కబిడ్ద రాకకోసమైనా సరే ఎదురుచూపు..
బీపీమిషన్‌ పంప్‌, ఓపెన్‌ హార్ట్‌ దశ్యం, కొట్టుకుంటున్న గుండె..
ఫకీర్‌, దుర్వేష్‌ లు భయం భుజాలకు అభయ తాయత్తు..
జెండాలసాయబు సాంబ్రాణి పొగల్లో, దర్గాల దువా..
అచ్చంగా ఇది ఒకప్పుడు
నెమలిపింఛాల గుచ్ఛం భయం కసువు ఊడ్చిపారేసె సాఫ్‌ సీదా నగరం..
షాయరీల షాయర్లకు
బండరాళ్లు కాగితాలు కోట గుండెల్లో వెయ్యేళ్ల సెలయేళ్లుపైబడి అముద్రిత కవిత్వం.. ప్రవహిస్తున్న ఊరు..
ఇటు ఖిల్లా కళ్లల్లోకి చూస్తుండే అటు నరసిమ్హ స్వామి
ఏటి పూల్‌ వంతెన నీళ్లమీది పడవ, మున్నేటి అద్దంలో నగరం అందం
ఆంజనేయుడు హజరత్‌ బాబా నయాబజార్‌ చౌరస్తా
విచ్చిన్నం కాని శతాబ్దాల సుందర దశ్యం..
యా అల్లాV్‌ా.. గుండె అరచేతులు చాచి అర్థించేది ఈ వరాల వానచుక్క కోసం..
అమ్మ కొడుకులు యూసుఫ్‌ సీనూ అన్నాతమ్ములు..
గుమ్మం సామరస్యతోరణం ..
ఎ షహర్‌ అయిసా.. సౌభ్రాతత్వపు బొమ్మా బొరుసు పైసా
దర్గాలు మసీదులు… ఎదుగుతున్న వరిచేలు
లాల్‌ ఖిల్లా ఒంటికి హరియాలీ లాల్చీ..
ఆకాశంలో వరినాట్లు తోరణాల ఆకుపచ్చ గీతలు ఊపిరి బూరల్లో పైరు పచ్చగాలి
ములాఖత్‌లు మిలాఖత్‌లు ఇచ్చిపుచ్చుకునే భారు, సలాంలు
సిలార్‌, నజీర్‌, మదార్‌, ఫాతిమా మినార్లమీద నెలవంకలు..
నవాబ్‌ దర్జా, మొఘల్‌ శైళి
గల్లీలు మొహల్లాలు బాగ్‌లు ఖవాలీ గజళ్ల అత్తరు చెట్లు
జై భజరంగ భళీ బోగంకుంటగల్లీ
న్యూ మదీనా హోటల్‌ ఫిరోజ్‌ భారు పాయా, కీమా రోటీ
స్టేషన్‌ రోడ్డు ఆవిరి పొగల బాయిలర్‌
ప్రవహిస్తూ హిస్తూనే ఎర్రరక్తం చాక్లెట్‌ రంగు మలారు మిలారు
మనుషుల్లో మాటలు మరుగుతున్న డికాక్షన్‌..
మియాభారు సమోసా..
ఏనుగు కోరల్లో ఏక్‌ దం ఇలాచీ, అద్రక్‌
ప్యాల, ప్యాలా వ పూరా ప్యారా ప్యారా..
జిల్లీలు బాంబులు అవ్వారు సువ్వారులు
చెరువుబజార్‌ మందులోళ్ల శివకాశి
మదర్సా, ఖాజీపురా పూరా అలీఫ్‌ బే శారాల సూరా..
దూది పీరి, గంధం పీరి, కత్తి పీరి గొడుగు పీరి, బారిమా
ఊరు ఉమ్మడి గుండంలో అస్సోరు దులా..
తెలుగులో ఉర్దూ పదాలు, లడ్డూలో కిస్‌ మిస్‌
బారాత్‌ షాదీఖానా వV్‌ా..దావత్‌ లేనా..
హలీం, హరిస్‌ దక్కన్‌ రుచులు
చాపలు, మంచం పట్టెల మీద నూలుపోగులచేనేత గల్లీల్లోలేలేత సేమ్యా కారా? నా
రమజాన్‌ బక్రీద్‌ పసుపుగడపలకు విందు పంచకుంటే పండగ పూర్తికాదు..
కటిక బజార్‌ …రాతి దర్వాజా. ఖిల్లాబాగ్‌ అత్తరు పరిమళాలు
చేతులకేనా డిజైన్లు, పెదవులపై పాన్‌ బీడా మెహిందీలు..
రంగు వెలసినట్టు కనిపించినా అదే మందారం విప్లవ సింధూరం
అంగళ్ల రతనాలు ఆనవాళ్ల జమానా
నిజాం సంస్థాన్‌, భారత్‌ కరెన్సీ మారిన ఫారిన్‌ ఎక్చేంజ్‌ స్టేషన్‌ ..
జుమ్మేరాత్‌ బజార్‌
వీధంతా ఇదుల్‌ ఫితర్‌ ఈద్‌ ఇత్తర్‌.. జూతా పేద పాదాలకు రంజాన్‌ తోఫా
ఊరు డిష్‌ పై వందకోయిలల గుంపు
సెకన్‌ వ్యవధిలో కోరస్‌
తెల్లవారు ఝామునుంచి మసీదులో మైకు కోళ్లు అజా వినపడనిదే కుదురుండదు..
రేకుపలక, నోట్సు అట్ట పీరిల ఆకతులు ఇప్పటికీ కత్తిరించుకుంటున్నా
కొబ్బరి పుల్లల బుట్టలల్లి బిస్కెట్ల శారానై వేళాడుతున్నా..
కందిల్‌ రాకకోసం ఊరి మెలకువ కళ్ళలో ఉర్సు రాత్రి
గుర్రపుడెక్కల శబ్దం కోసం ఉగ్గబడుతున్న గుండె ..
పీర్ల కొట్టాల్లో బూంది మిఠాయి చదివిస్తున్నట్టు కల..
మౌల్‌ సాబ్‌ చేతి దువా తీసుకుంటున్నకళ..
వేడి నిప్పుల్లో పాదాల్ని అస్సోరు దులా హలాల్‌ చేద్దమంటే..
నర్తకిలో వంద సెకండ్‌ షోలై
యూసూఫ్‌ మియా నీ నవ్వు ఆడటం లేదు
రైలు దిగుతున్న బోగీ నదులు
ఊరు సముద్రంలో కొట్టుకుపోతున్న ప్రయాణికులు
రైల్వేస్టేషన్‌ ముందు తొలిమజిలీ ..
ప్రొక్లైన పాదాలకింద పడి నలిగిపోయిన శిథిలాల్లో దస్తగిరి హోటల్‌ నజీర్‌ ..
తలకెక్కిన పడవనై, బొడ్దు దోపిన జెండానై ముందునడిచే మేకనై ఆరెంపుల దర్గాకు అడుగేయాలనుంది, దారులు కాటు కలిశాక మీ ఆచూకీ దొరకటంలేదు..
మా ఇళ్ళపై జెండాలు మొలిపించారు, కళ్ళల్లో ఎవరో కాషాయం కొట్టారు
రిక్కాబజార్‌ లో
పగిలిన ట్యూబులు మూసే ఖాకీ నిక్కర్‌ సైకిల్‌ షాప్‌వాలా
సామరస్య వ్యతిరేకులనోళ్లకు పంచరేయటంలేదు..
అబీద్‌ మామూ కనపడటం లేదు
కొడుకురాసిన ఉత్తరం చదివి
జవాబు రాసేదెవరని ఇంటికీ గంజ్‌ బజారుకూ ఇప్పటికీ గుబులు వంతెనవుతోంది అమ్మమ్మ..
ముత్యాలమ్మగుడి నుంచి గంజ్‌ షహీద్‌ దర్గా ఎన్ని అడుగుల దూరపు దగ్గరో కొలిచేవారేరి..
మఖ్‌మల్‌ఘోషా కప్పి ఇంటింటికీ బక్రీద్‌ ఘోష్‌, రంజాన్‌ తోఫా లేవి..
యాభరు, ఎనభరు అడుగుల రోద్లేశారిప్పుడు
నా ఇరుకు సందులు, గల్లీల మత విశాలమెటు పోయింది..
కిరసనాయిల్‌ డ్రమ్ము రిక్షాఎక్కి రావటంలేదు
హిందూ ముస్లిం గూళ్ళనుంచి డబ్బా పక్షులు వాలటంలేదు..
కొట్టాలకు గాయబ్‌ మంత్రమేశారు,
పీరీలు ఏడాదికోసారి వొచ్చి కూర్చునే చోటు లేదు
ప్రేమ దారాలు చుట్టుకున్న
వీధి దాటుతున్న జెండాలచెట్టు ఇళ్లమీదకు నెమలీక నీడ,
చెట్టు మొదట్లో చక్కెరతిన్న నల్లచీమలకు అదేమైపోతుందోనని భయంగా ఉంది..
కోనేటిలో రాయివిసురుతున్న కొత్తనగరం తాతలపాతబస్తీ చెదురుతున్న చిత్రపటం
పాతబజార్లో నాకు చోటులేదు
వేపచెట్టుగాలిపీల్చి ఎదిగొచ్చిన సైకిల్‌ గుండెకు కార్ల నగరంలో ఊపిరాడదు..
ఒంపు సొంపుల ఒంతెన ఒడ్డున చితి చింతన
కాష్టాలదిబ్బ, గోరీల గడ్దన పాడెకు కట్లుబిగించినట్టు కొత్తగా తీగెల వంతెనట
మత సంగమ జ్ఞాపకాల వారధిని నిమజ్జనం చేస్తే
మున్నేటి బతుకుకొమ్మల్లో బతుకమ్మలు, ఉరుసు యాదులు తీరని మనాదులు
-సూఫీ శ్రీనివాస్‌, 9640311380