– గ్రామాధ్యక్షురాలిగా గెలిచి రెండేండ్లు
– అయినా జరగని ప్రమాణస్వీకారం
– దళితురాలికి బాసటగా సీపీఐ(ఎం), వీసీకే, టీఎన్‌యూఈఎఫ్
చెన్నై : తమిళనాడులో ఎన్నికల్లో గెలిచిన ఒక దళిత మహిళ వివక్షను ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో గెలిచి రెండేండ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఆమె ప్రమాణస్వీకారానికి నోచుకోక అన్యాయానికి గురవుతున్నది. 2021 అక్టోబర్‌లో తిరుపత్తూరు జిల్లాలోని నాయకనేరి పంచాయతీ అధ్యక్షురాలిగా దళిత మహిళ ఎన్నికైంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సర్టిఫికేట్‌ను సైతం ఆమె ఎన్నికల అధికారుల నుంచి అందుకున్నది. ఇది జరిగి దాదాపు రెండేళ్లు దాటినా జిల్లా యంత్రాంగం మాత్రం ఆమెతో ఇంకా ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇది ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే చర్యలో భాగమనీ, పెత్తందారీ కులమైన వన్నియార్ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న పంచాయతీలో ప్రమాణం చేయడానికి ఆమెకు అనుమతి లభించటం లేదని దళిత సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ మహిళలకు పంచాయతీని రిజర్వ్ చేయాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ వన్నియార్ కులానికి చెందిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేయబడినప్పటికీ, కేసు అప్పీల్ ఫలితం దళిత మహిళ ప్రమాణ స్వీకారంపై పడింది. పంచాయతీలో తక్కువ ఎస్సీ జనాభా ఉన్నందున పెత్తందారీ కులాల సభ్యులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ అంశంపై సీపీఐ(ఎం), తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్ (టీఎన్‌యూ ఈఎఫ్), విడుతలై చిరుతైగల్ కట్చి(వీసీకే)లు జోక్యం చేసుకున్నాయి. సెప్టెంబర్ 13న జిల్లా కలెక్టర్‌తో చర్చలు జరిపారు. అనంతరం, ఈనెల 23లోగా ప్రమాణస్వీకారం పూర్తయ్యేలా చేస్తామన్న హామీ కలెక్టర్ నుంచి వచ్చిందని జరిగిన చర్చల అనంతరం సీపీఐ(ఎం), టీఎన్‌యూఈఎఫ్, వీసీకే నాయకులు వెల్లడించారు.