‘ఆమె’కు ఆరోగ్య పరీక్షలు

– హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో మహిళా క్లీనిక్స్‌
– 8 రకాల వ్యాధులకు ఉచిత స్క్రీనింగ్‌, చికిత్స
– ప్రతి రోజూ ఒక్కో సెంటర్‌కు 40-45 మంది బాధితులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
న్యూట్రిషన్‌ కిట్‌, కేసీఆర్‌ కిట్‌, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌, పట్టణ దవాఖానలతో ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల కు దగ్గరైన వైద్య, ఆరోగ్యశాఖ మరో అడుగు ముందుకేస్తూ.. మహళ ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అన్నట్టుగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు ‘ఆరోగ్య మహిళ’ పేరుతో మరో సర్వీస్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.ఈకార్యక్రమంలో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రతి మంగళవారం 8 రకాల రుగ్మతలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌ జిల్లాలో 85, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 35 కేంద్రాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్‌ కొనసాగుతున్నాయి. ప్రతి మంగళవారమూ ఆయా కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీంతో వ్యాధి ముదరక ముందే చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కో సెంటర్‌లో ప్రతి రోజూ 50 మంది మహిళలకు పరీక్షలు చేయాలనే లక్ష్యం ఉండగా.. ప్రస్తుతం ఒక్కో సెంటర్‌లో 40-45 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. స్క్రీనింగ్‌ తర్వాత మందులు, ఉచిత చికిత్స అందిస్తున్నారు. శాంపిల్స్‌ సేకరించి ఫలితాల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైతే ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌, నిమ్స్‌ వంటి హాస్పిటల్స్‌కు రెఫర్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. రెండు జిల్లాల్లోనూ గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్‌ ఏర్పాటు చేశారు.
మహిళా వైద్య సిబ్బందితోనే పరీక్షలు
స్క్రీనింగ్‌ క్యాంపుల్లో మహిళా సిబ్బంది మాత్రమే సేవలు అందిస్తున్నారు. వీరు వ్యాధులను నిర్ధారించడమే కాకుండా భవిష్యత్‌లో మహిళలు దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడకుండా సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో దాదాపు చాలా వరకు ఇక్కడే పరిష్కారం దొరుకుతుందని వైద్యులు చెబుతున్నారు. రెండు జిల్లాల వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన మహిళలు సాధారణ రక్తహీనత, అయోడిన్‌ లోపం, అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు, విటమిన్‌ లోపం, మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు, నెలసరి సమస్యలు, సంతాన లేమి, మోనోపాయిజ్‌, గర్భాశయ ముఖద్వార, రొమ్ము, ఓరల్‌ క్యాన్సర్‌, థైరాయిడ్‌, హెచ్‌ఐవీ, ఫోలిక్‌ యాసిడ్‌, ఒబెసిటీ,
వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు చికిత్స అందిస్తున్నారు. ఆయా వ్యాధి లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు. ఆరోగ్యంపై అవగాహన లేక, చికిత్సకు డబ్బులు లేక చాలా మంది తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు తమ సమస్యలను బయటికి చెప్పుకోవడానికి నిరాకరిస్తుంటారు. తీరా వ్యాధి ముదిరి, బయటపడే సమయానికి కోలుకోలేని నష్టం సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడకూడదనే ఉద్దేంతో ప్రభుత్వం ఇటీవల ‘మహిళ క్లినిక్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది.

 రకాల పరీక్షలు ఇలా..
మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు చేస్తారు.
ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్ల స్రీనింగ్‌ నిర్వహిస్తారు.
థైరాయిడ్‌ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్‌ సమస్య, ఫోలిక్‌యాసిడ్‌, ఐరన్‌లోపంతోపాటు విటమిన్‌ బీ12, విటమిన్‌ డీ పరీక్షలు చేస్తారు.
మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
మెనోపాజ్‌ దశకు సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి హార్మోన్‌ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతోపాటు అవగాహన కల్పిస్తారు. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు.
సెక్స్‌ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు.
మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మహిళా క్లినిక్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. 8 రకాల రుగ్మతలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నాం. మరింత మంది మహిళలకు కూడా ఈ మహిళా క్లినిక్స్‌ గురించి వివరించి అవగాహన కల్పించాలి. తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అన్నట్టు మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
డాక్టర్‌ జె.వెంకటి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్‌
ఇది రొటీన్‌ కార్యక్రమం కాదు
‘ఆరోగ్య మహిళా’ రొటీన్‌ కార్యక్రమం కాదు. మహిళలకు ఉపయోగపడేది. వారు బయటికి చెప్పుకోలేని రుగ్మతలు, సమస్యలకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మహిళా క్లినిక్‌లను సంప్రదించిన చెకప్‌లు చేయించుకోవాలి. జిల్లాలోని 18 ఏండ్లు దాటిన మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి