ఆమె బాధ్యతగా ఆలోచించాలి

She should think responsiblyఆ మధ్య కాలంలో ఒకరినొకరు ఇష్టపడటం, సంబంధాలు పెట్టుకోవడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. సంబంధం పెట్టుకున్నప్పుడు ఎలాంటి విషయాల గురించి ఆలోచించరు. ఆకర్షణలో పడిపోయి అన్నీ మర్చిపోతుంటారు. తీరా పరిస్థితి ఇబ్బంది కరంగా మారినప్పుడు బంధాలు, బాధ్యతలు గుర్తుకు వస్తుంటాయి. ఇలాంటి సంబంధాల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది, బాధ పడుతున్నది మహిళలే కావడం బాధాకరం. ఇలాంటి సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌…
అమృతకు సుమారు 40 ఏండ్లు ఉంటాయి. ముగ్గురు పిల్లలు. భర్త నవీన్‌ చనిపోయి దాదాపు ఏడాది అవుతుంది. అమృత ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అక్కడే ఆమెకు సునీల్‌తో పరిచయం. దాదాపు ఐదేండ్ల నుండి వారి మధ్య స్నేహం ఉంది. తర్వాత కాలంలో స్నేహం మరింత ముందుకు వెళ్ళింది. భర్త అనారోగ్యంలో ఉండడంతో ఆమె సునీల్‌కు దగ్గరయింది. సునీల్‌ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరితో ఎంతో అభిమానంగా ఉండేవాడు. అమృతకు తనకు తెలియకుండానే సునీల్‌కు బాగా దగ్గరయింది. అమృతకంటే అతను వయసులో చిన్నవాడు. అయినా వారి మధ్య చనువు శారీరక సంబంధం పెట్టుకునే వరకు వెళ్ళింది.
భర్త చనిపోయినప్పటి నుండి ఆమెకు తాను ఒంటరినైపోయాను అనే భావన వచ్చింది. పిల్లలు కాలేజీకి, స్కూల్‌కి వెళ్ళిపోయేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. దాంతో సునీల్‌ని పెండ్లి చేసుకుంటే బాగుండనిపించింది. కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయా? సునీల్‌ ముందు పెండ్లి ప్రస్తావన తీసుకురావాలనుకుంది. అయితే అప్పుడే ఆమెకు ఓ విషయం తెలిసింది. సునీల్‌ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తెలిసి అమృత, సునీల్‌తో గొడవ పడింది. ‘నన్ను ఎందుకు మోసం చేశావు, నన్ను పెండ్లి చేసుకోకపోతే పోలీస్‌ స్టేషన్లో కేసు పెతడాను’ అంటూ బెదిరించింది.
దానికి అతను ‘నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’ అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమీ చేయాలో అర్థం కాక ఐద్వా అదాలత్‌ దగ్గరకు వచ్చింది. మేము సునీల్‌కు ఫోన్‌ చేసి పిలిపించి ‘అమృతతో ఇన్ని రోజులు చనువుగా ఉన్నావు. ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నావు. ఆమె నిన్ను పెండ్లి చేసుకోవాలనుకుంటుంది. గత ఐదేండ్ల నుండి మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది. ఇప్పుడు ఆమెను కాదు అని వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఇది సరైనది కాదు’ అన్నాము.
దానికి అతను ‘నేనూ అమృత ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళం. ఆమె అంటే నాకు ఇష్టమే. కానీ ఆమె నాకంటే వయసులో పెద్దది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న పిల్లలు కాదు. ఆమె భర్త చనిపోయి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అమృతను పెండ్లి చేసుకోలేను. ఈ విషయం ఆమెకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. నాకు పెండ్లి కావల్సిన ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నేను ఆమెను పెండ్లి చేసుకుంటే వాళ్ళకు పెళ్ళి ఎలా అవుతుంది? జీవితం మొత్తం అమృతకు మంచి స్నేహితునిగా ఉంటాను. అంతాగానీ పెండ్లి మాత్రం చేసుకోలేను. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా సహాయం చేస్తాను. అలా కాదని ఆమెను పెండ్లి చేసుకుంటే నాతో పాటు నా చెల్లెళ్ళ జీవితం కూడా పాడైపోతుంది. ఈ విషయం ఆమెకు చెబితే పోలీస్‌ స్టేషన్లో కేసు పెడతానంటుంది. మీరే ఆమెకు ఎలాగైనా నచ్చజెప్పండి’ అన్నాడు.
‘నీకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారన్న విషయం నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? అమృతతో సంబంధం పెట్టుకునేటపుడు ఈ విషయం తెలియదా? నీ కుటుంబం గురించి ఇంత బాధ్యతగా ఆలోచించే వాడివి మీ పరిచయాన్ని స్నేహంతోనే ఆపేయకుండా శారీరక సంబంధం వరకు ఎందుకు తీసుకెళ్ళావు. అప్పుడు ఆమె అవసరాలను, బలహీనతను వాడుకున్నావు. ఇప్పుడు నీ కుటుంబం కోసం పెండ్లి చేసుకోనంటు న్నావు. ఇది సరైన పద్ధతి కాదు’ అని గట్టిగా చెప్పాము.
దానికి అతను ‘మేడమ్‌ మీరు చెప్పినట్టు నేను చేసింది తప్పే. అప్పుడు ఆమె కూడా నాతో సంబంధానికి ఒప్పుకుంది. కాబట్టే ముందుకు వెళ్లాము. ఇప్పుడు మీరే ఆమెకు ఎలాగో చెప్పి ఒప్పించండి’ అంటూ బతిమాలుకున్నాడు.
మేము అమృతను పిలిచి ‘సునీల్‌ నీకంటే వయసులో ఎనిమిదేండ్లు చిన్నవాడు. నీ భర్త అనారోగ్యంలో ఉన్నప్పుడు అతనికి శారీరకంగా దగ్గరయ్యావు. ఇలాంటి సంబంధాలు మంచిది కాదు. ఎప్పటికైనా సమస్యలనే తెచ్చిపెడతాయి. నువ్వు ఇప్పుడు చాలా బాధ్యతగా ఆలోచించాలి. కేవలం నీ గురించి మాత్రమే కాదు నీ పిల్లల భవిష్యత్‌ గురించి కూడా ఆలోచించాలి. నీకు ఇప్పుడు కావల్సింది జీవిత భాగస్వామి మాత్రమే కాదు. నీ పిల్లల బాధ్యత చూసుకునే ఒక మంచి వ్యక్తి. సునీల్‌ కూడా నీకు జీవితాంతం ఓ మంచి స్నేహితునిగా ఉంటానంటున్నాడు. కానీ అతను ఎన్ని రోజులు అలా ఉంటాడో చెప్పలేం. తర్వాత అతని మనసు మారిపోవచ్చు. వయసులో ఇంత తేడా ఉన్న వ్యక్తిని పెండ్లి చేసుకుంటే రేపు రేపు అనేక సమస్యలు వస్తాయి. నీకూ పెద్దగా వయసేమీ లేదు. కాబట్టి నీ వయసుకు తగ్గట్టు ఓ మంచి వ్యక్తిని చూసి పెండ్లి చేసుకో. నీకూ, నీ పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని వ్యక్తి కోసం ఎందుకు అనవసరంగా ఆరాట పడటం’ అని సర్ధి చెప్పాము.
ఆమె కుటుంబ సభ్యులను కూడా పిలిపించి మాట్లాడాము. అమృతకు ఓ మంచి వ్యక్తిని చూసి పెండ్లి చేయమని చెప్పాము. ఏడాది తర్వాత వాళ్ళు ఓ వ్యక్తిని చూపి ఆమెకు పెండ్లి చేశారు. అతని భార్య చనిపోయింది. అతనితో పెండ్లి తర్వాత అమృతకు మరో బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఆమెకు నలుగురు పిల్లలు. అతను కూడా ఆమెను, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది.
– వై. వరలక్ష్మి, 9948794051