‘చిన్నప్పుడు పిల్లల్లో ఓ మంచి ఎమోషన్‌ను నింపితే వాళ్లు పెద్దై ఏదైనా సాధించగలరు అని చెప్పటానికి ‘విమానం’ సినిమా ఒక ఉదాహరణ’ అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను వీక్షించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు శివ ప్రసాద్ తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ గురించి చెబుతుంటే బాగా టచింగ్‌గా అనిపించింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. తల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా.. వాళ్ల పిల్లలకు కూడా సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలాగే సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ ఎంతో అద్భుతంగా పండాయి’ అని తెలిపారు. ఈ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా, సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. నటి మీరా జాస్మిన్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.