డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు

Singareni elections on December 27– హైకోర్టు ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగరేణి కార్మిక సంఘం (గుర్తింపు సంఘం) ఎన్నికలను డిసెంబర్‌ 27న నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఓటర్ల లిస్ట్‌ను నవంబర్‌ 30 నాటికి సిద్ధం చేయాలని ఆదేశించింది. ఓటర్ల లిస్ట్‌ను కేంద్ర కార్మిక శాఖకు సింగరేణి యాజమాన్యం అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ వినతిని అనుమతిస్తున్నామని, మార్పు చేసిన తేదీలకు అనుగుణంగా చేస్తామని సింగరేణి యాజమాన్యం రాతపూర్వకంగా హామీ పత్రాన్ని గురువారం అందజేయాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాల ప్రకారం అక్టోబర్‌ నాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర కార్మిక శాఖ ఈనెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం సింగిల్‌ జడ్జిని మరోసారి కోరితే ఫలితం లేకపోయింది. దీంతో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరథే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ చేపట్టింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించింది. ఎన్నికలను డిసెంబరు 27కి వాయిదా వేసింది. అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను వెల్లడించాలని సూచించింది. ఈలోగా తాజా ఓటర్ల లిస్ట్‌ను సిద్ధం చేసి వచ్చే నవంబర్‌ 30 నాటికి కేంద్ర కార్మిక శాఖకు యాజమాన్యం అందజేయాలని ఆదేశించింది. నవంబర్‌ 30లోపు ఓటర్‌ లిస్ట్‌ అందుకున్న తర్వాత చట్ట ప్రకారం ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌ 27న ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ, గుర్తుల కేటాయింపు జరిగి ఉంటే వాటన్నింటినీ తిరిగి తాజాగా చేపట్టాలని ఆదేశించింది.
ఇదీ నేపథ్యం…
ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అయ్యింది. ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. గత ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగింపు జరుగుతూ వచ్చింది. జూన్‌ 23న సింగరేణి ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి కీలక ఉత్తర్వులను జారీ చేయడంతో ఎన్నికలు వాయిదా వేయాలని యాజమాన్యం చేసిన అప్పీల్‌ను డివిజన్‌ బెంచ్‌ అనుమతించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ల షెడ్యూల్‌ వెలువడిందనీ, నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని వెల్లడించిందనీ, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ, ఇతర వ్యవహారాల్లో ఉంటారని డివిజన్‌ బెంచ్‌ గుర్తు చేసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలనే సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను డిసెంబర్‌ 27న నిర్వహించేలా ఆర్డర్స్‌ను సవరిస్తున్నట్టు తెలిపింది. అసెంబ్లీ అయ్యాక లోక్‌సభ ఎన్నికల పేరుతో వాయిదా వేయాలని కోరే అవకాశం ఉందని యూనియన్ల తరఫు సీనియర్‌ లాయర్‌ విద్యాసాగర్‌ చెప్పారు. రాష్ట్రం ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎన్నికల తేదీలను వెల్లడించాలని కేంద్రం కోరింది. వాదనల తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబర్‌ 29కి వాయిదా వేసింది.