‘ఆజాన్‌’ గీతాలాపనే నేరం

ముంబయిలో పాఠశాల ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌
ముంబయి:  ముంబయిలోని కండివాలీ ప్రాంతంలో ఉన్న కపోల్‌ విద్యానిధి ఇంటర్నేషనల్‌ స్కూలులో ఉదయం వేళ ప్రార్థనల సమయంలో ముస్లిం గీతం ‘ఆజాన్‌’ ఆలపించమని చెప్పిన పాపానికి ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆజాన్‌ ఆలపించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల వెలుపల శుక్ర వారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో బీజేపీ, శివసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే యోగేష్‌ సాగర్‌ నేతృత్వం వహించారు.
కాగా వివిధ మతాల ప్రార్థనా గీతాలను గురించి విద్యార్థులకు అవగాహన కలిగించేందుకే ఆజాన్‌ను ఆలపించామని పాఠశాల ప్రిన్సిపాల్‌ రష్మీ హెగ్డే వివరణ ఇచ్చారు. తమ ప్రయత్నాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె వాపోయారు. ఆజాన్‌ ఆలాపన ద్వారా మత విశ్వాసాలను గాయపరిచారంటూ స్థానిక శివసేన నాయకుడు సంజరు సావంత్‌ ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ అజరు కుమార్‌ బన్సల్‌ చెప్పారు. ‘శుక్రవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయంలో మైనారిటీ తరగతికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు తన ఫోన్‌ నుండి లౌడ్‌స్పీకర్‌ ద్వారా ఆజాన్‌ వినిపించారు. ఇది ఏదో పొరబాటున జరిగింది కాదు’ అని ఎమ్మెల్యే సాగర్‌ అన్నారు. కాగా ఆ ఉపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఉదంతంపై పాఠశాల యాజమాన్యం కూడా విచారణ జరుపుతోందని ప్రిన్సిపాల్‌ తెలి పారు. ఇది హిందూ పాఠశాల అని, విద్యార్థులతో గాయత్రీ మంత్రం, సరస్వతీ వందనం చదివిస్తామని ఆమె చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కానీయబోమని అన్నారు.