సామూహిక లైంగికదాడి కేసులో ఆరుగురు అరెస్ట్‌

– వివరాలు వెల్లడించిన సీపీ డీఎస్‌ చౌహాన్‌
నవతెలంగాణ-హయత్‌నగర్‌
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా మరోకరు పరారీలో ఉన్నారు. మంగళవారం ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను సీపీ డీఎస్‌ చౌహాన్‌ మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్‌ లాలాపేట శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఓ బాలిక వారం రోజుల కిందట మీర్‌పేట నందనవనంలో ఉన్న సోదరి ఇంటికి వచ్చింది. ఈనెల 21న బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి ఇంట్లో ఉండగా.. సీతారాంపేట, మంగల్‌హాట్‌లో నివాసం ఉంటున్న అబేద్‌-బిన్‌-ఖాలీద్‌ అలియాస్‌ అబిద్‌ తన స్నేహితులు తహసీన్‌ అలియాస్‌ టైసన్‌, మంకాల మహేష్‌ మరో నలుగురితో కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వారంతా గంజాయి మత్తులో ఉన్నాయి.
బాలిక సోదరులకు కత్తి చూపెట్టి భయపెట్టి.. అబేద్‌ బాలిక జుట్టు పట్టుకొని నోరు గట్టిగా మూయగా.. మిగతావారు ఆమె సోదరులను పట్టుకుని కత్తి చూపెట్టారు. ఆ తర్వాత బాలిక గొంతుపైనా కత్తి పెట్టి అబేద్‌ లైంగికదాడి చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేశారు. అనంతరం విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాన నిందితుడు అబేద్‌-బిన్‌-ఖాలీద్‌ ఏ అబిద్‌ నందనవనం వైపు పోతుండగా సంతోష్‌నగర్‌ వద్ద ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తహసీన్‌ పరారీలో ఉన్నాడు.
అబేద్‌-బెన్‌-ఖలీద్‌ రౌడీ షీటర్‌ అని తెలిసింది. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సాయి, మల్కాజిగిరి ఎస్‌ఓటీ డీసీపీ గిరిధర్‌ రావు, మహేశ్వరం ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌రావు తదితరులు ఉన్నారు.