ఎస్‌ఎమ్‌సీ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

– హెడ్‌ మాస్టర్‌ భూక్యా రమేష్‌
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగిందని మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్యా రమేష్‌ అన్నారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో ఆయన అధ్యక్షతన పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రగతి, పాఠశాలలో అమలవుతున్న నూతన ఎఫ్‌.ఆర్‌.ఎస్‌ హాజరు గురించి, మన ఊరు – మన బడి పనికి సంబంధించిన వివరాలు, మధ్యాహ్నం భోజనం అమలు తీరు గురించి వివరించామన్నారు. అలాగే బాల్యవివాహాల వల్ల జరిగే అనర్ధాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. దాంతో పాటు ఎస్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను వారి సమక్షంలో విడుదల చేశామని చెప్పారు. పాఠశాలలో యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసి ఓటర్‌ లిస్ట్‌ను పాఠశాల నోటీసు బోర్డు, పంచాయతీ కార్యాలయంలో, గ్రామ కూడళ్ళలో, ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఈనెల 22 నుండి 23వ తేదీ వరకు సమర్పించాలని అన్నారు. తుది జాబితాను ఈనెల 24వ తేదీన ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈనెల 29వ తేదీన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సభ్యుల ఎన్నిక జరుగుతుందని, అదే రోజు మొదటి సమావేశం సైతం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టీచర్లు హైమావతి, శిరీష, అంగన్వాడీ టీచర్‌ బుచ్చమ్మ, ఆయా లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.