ఎడతెరిపి లేకుండా ముసురు

– పలుచోట్ల భారీ వర్షం
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– పొంగిన వాగులు, వంకలు
– నిలిచిన రాకపోకలు, జనజీవనం అస్తవ్యస్తం
– రోడ్లపైకి వరదనీరు,
– డ్రయినేజీ వ్యవస్థ చిన్నాభిన్నం
– చందానగర్‌, శేరిలింగంపల్లిలో భారీ వర్షం
– శేరిలింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్ద
– 4 అడుగుల మేర నీరు
– చేవెళ్లలో గొర్రెలు, మేకలు మృత్యువాత
– పలు చోట్ల కూలిన ఇండ్లు
– పంట పొలాల్లోకి చేరిన నీరు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దాంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగాయి. వరద, డ్రయినేజీ నీరు రోడ్లపైకి చేరింది. పలుచోట్ల ఇండ్లలోకి కూడా వచ్చింది. ముఖ్యంగా చందానగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్ద 4 అడుగుల మేర నీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేవెళ్ల మండలంలో ఓ రైతుకు చెందిన గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. పలు మండలాల్లో ఇండ్లు కూలిపోయాయి. వికారాబాద్‌ జిల్లాలో పంటపొలాలలోకి నీరు చేరింది. పరిగిలో వాగు పొంగి నీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలు చోట్ల సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే పోలీసులు, అధికారులను సంప్రదించాలని సూచించారు.