ఏక్‌నాథ్‌ షిండే అనర్హతపై స్పీకర్‌ జ్యాపం

– సుప్రీంను ఆశ్రయించిన ఉద్ధవ్‌ ఠాక్రే గ్రూపు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై అనర్హత వేటు ప్రక్రియను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ జాప్యం చేస్తున్నారంటూ ఉద్ధవ్‌ ఠాక్రే గ్రూపు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్‌సిపి రెండుగా చీలి అజిత్‌ పవార్‌ గ్రూపు షిండే ప్రభుత్వంలో చేరిన సమయంలో ఠాక్రే గ్రూపు ఈ పిటీషన్‌ వేసింది. నార్వేకర్‌ యొక్క ప్రవర్తన రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం స్పీకర్‌ తటస్థ మధ్యవర్తిగా ఉంటూ తన రాజ్యాంగ విధులను నిర్వహించాల్సిన బాధ్యతను ‘నమ్మకంగా విస్మరిస్తుంది’ అని ఉద్ధవ్‌ ఠాక్రే గ్రూపు తన పిటీషన్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘నేరం చేసిన సభ్యులపై దాఖలు చేసిన అనర్హత పిటీషన్లను త్వరగా, గడువులోగా పరిష్కరించాలని స్పీకర్‌ను ఆదేశించాలని, లేదా ప్రత్యామ్నాయంగా అనర్హత పిటీషన్లపై సుప్రీంకోర్టే స్వయంగా నిర్ణయం తీసుకోవాలి’ అని శివసేన (యుబిటి) నాయుకులు సునీల్‌ ప్రభు దాఖలు చేసిన 406 పేజీల పిటీషన్‌లో కోరారు. ఈ సందర్భంగా 2020లో కౌషమ్‌ మేఘాచంద్ర సింగ్‌ వర్సెస్‌ మణిపూర్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్ధవ్‌ ఠాక్రే గ్రూపు తరుపు న్యాయవాదులు గుర్తు చేశారు. అనర్హత పిటీషన్లను దాఖలు చేసిన తేదీ నుంచి మూడు నెలలలోపు నిర్ణయించాలని అప్పట్లో తీర్పు ఇచ్చింది. అలాగే ఈ ఏడాది మే 11న ఠాక్రే- షిండే వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ స్పీకర్‌ నార్వేకర్‌పై విశ్వాసం ఉంచిందని, అనర్హత పిటీషన్లపై స్పీకర్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపిందని ఠాక్రే గ్రూపు గుర్తు చేసింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన మూడు నెలలు గడిచినా స్పీకర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క విచారణకు కూడా పిలవలేదని తెలిపింది.